ఇరాన్‌కు రష్యా అండ.. అమెరికాకు పుతిన్ కీలక సూచన

by Gantepaka Srikanth |

ఇరాన్ నూతన సంవత్సరం 'నౌరూజ్' సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ అగ్రనేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇరాన్‌కు రష్యా అండ.. అమెరికాకు పుతిన్ కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ నూతన సంవత్సరం 'నౌరూజ్' సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ అగ్రనేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ఇరాన్‌కు రష్యా ఒక నమ్మకమైన స్నేహితుడిగా, దృఢమైన భాగస్వామిగా నిలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయితొల్లా మోజ్తబా ఖమేనీ, అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌లకు పుతిన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను ఇరాన్ ప్రజలు గౌరవప్రదంగా అధిగమిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు మధ్యప్రాచ్యాన్ని అగాధంలోకి నెట్టాయని, ఇది ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీసిందని రష్యా విమర్శించింది.

ఆ వార్తలు ఫేక్..

రష్యా బహిరంగంగా మద్దతు తెలుపుతున్నప్పటికీ, 1979 విప్లవం తర్వాత ఇరాన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభంలో రష్యా నుండి ఆశించిన స్థాయిలో క్షేత్రస్థాయి సహాయం అందడం లేదని కొన్ని ఇరాన్ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల 'పొలిటికో' పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. ఉక్రెయిన్‌కు అమెరికా ఇస్తున్న నిఘా సమాచారాన్ని నిలిపివేస్తే, తాము కూడా ఇరాన్‌తో సమాచారాన్ని పంచుకోవడం ఆపేస్తామని రష్యా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే అమెరికా ఈ ప్రతిపాదనను తిరస్కరించగా, క్రెమ్లిన్ (రష్యా ప్రభుత్వం) మాత్రం ఈ వార్తలను 'ఫేక్' అని కొట్టిపారేసింది.

అణ్వాయుధాలపై రష్యా అభ్యంతరం..

రష్యా, ఇరాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్నప్పటికీ, అది పరస్పర రక్షణ ఒప్పందం (Mutual Defence Clause) కాదు. ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయడాన్ని రష్యా వ్యతిరేకిస్తోంది. ఇరాన్ అణుబాంబును రూపొందిస్తే మధ్యప్రాచ్యంలో అణు పోటీ మొదలవుతుందని మాస్కో ఆందోళన చెందుతోంది. అమెరికా జోక్యంతో వెనిజులాలో నికోలస్ మదురో అధికారం కోల్పోవడం రష్యాకు ఒక మిత్రదేశాన్ని దూరం చేసింది. అయితే, ఇరాన్‌పై దాడుల వల్ల పెరుగుతున్న చమురు ధరలు రష్యా ఆర్థిక వ్యవస్థకు కొంత మేర కలిసి వస్తున్నాయి.

Next Story