- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maha Kumbh: మాఘ పూర్ణిమ సందర్భంగా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా(Maha Kumbh) కొనసాగుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా(Maha Kumbh) కొనసాగుతోంది. ప్రపంచ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కాగా.. మాఘ పూర్ణిమ సందర్భంగా బుధవారం కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. బుధవారం ఒక్కరోజే.. త్రివేణీ సంగమం, ఇతర ఘాట్‌ల వద్ద దాదాపు 2 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈరోజు మాఘ పూర్ణిమ వేళ భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే, మాఘ పూర్ణిమ స్నానంతో తమ నెల రోజుల కల్పవాసీ దీక్ష ముగించుకొని దాదాపు 10లక్షల మంది మహా కుంభమేళా నుంచి తరలివెళ్లనున్నారు. దీంతో వారంతా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, పార్కింగ్ స్థలాలను మాత్రమే వినియోగించాలని అధికారులు కల్పవాసీలకు విజ్ఞప్తి చేశారు.
రద్దీ నియంత్రణకు చర్యలు
అంతేకాకుండా, రద్దీని నియంత్రించడానికి అధికారులు అనేక ఏర్పాట్లు చేశారు. మంగళవారం తెల్లవారుజాము 4 నుంచి మేళా ప్రాంతాన్ని ‘నో వెహికిల్ జోన్’గా అధికారులు ప్రకటించారు. అత్యవసర, నిత్యావసర సర్వీసులకు చెందిన వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. దీంతో యాత్రికులు సంగమం వరకు వెళ్లాలంటే దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. మరోవైపు ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మహా కుంభమేళాకు వెళ్లే దారులన్నీ 300 కిలోమీటర్ల దూరం వరకు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. కాగా, పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26న శివరాత్రి వరకూ ఈ కుంభమేళా కొనసాగనుంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 55 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాటు చేసింది. ఇక ఇప్పటివరకు 46.25 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు.






