- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉనికిలో లేని శాఖకు 20 నెలలుగా మంత్రి
గతంలో మంత్రి కుల్దీప్ సింగ్ ధనివాల్‌కు డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటీవ్ రిఫార్మ్స్ శాఖను కేటాయించారు. అయితే ప్రస్తుతం అది ఉనికిలో లేదు.

- ఆలస్యంగా గుర్తించిన ప్రభుత్వం
- గెజిట్ నోటిఫికేషన్ ద్వారా మార్పు
- పంజాబ్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: ఆ మంత్రి 20 నెలలుగా ఉనికిలోనే లేని శాఖకు బాధ్యతలు నిర్వర్తించాడు. అసలు అలాంటి శాఖ ఒకటి లేదని తెలియకుండానే దానికి మంత్రిగా ఉన్నాడట. 21 మంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తున్న సమయంలో ఈ తప్పును గుర్తించి ప్రభుత్వం గెజిట్ ద్వారా మార్పులు చేసిందట. ఇది పంజాబ్‌లో జరిగింది. పంజాబ్‌లో ఆప్ విజయం సాధించిన తర్వాత 2022లో భగవంత్ మన్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2023లో మంత్రి వర్గ పునర్వవస్థీకరణ చేసినప్పుడు కుల్దీప్ సింగ్ ధనివాల్‌కు ఎన్ఆర్ఐ అఫైర్స్, అడ్మినిస్ట్రేటీవ్ రిఫార్మ్స్ శాఖలకు మంత్రిగా చేశారు. గతేడాది చివర్లో కూడా కేబినెట్ పునర్వవస్థీకరణ జరిగినప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. తాజాగా పంజాబ్ చీఫ్ సెక్రటరీ శుక్రవారం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవరిస్తూ గెజిట్ జారీ చేశారు. అప్పట్లో మంత్రికి కేటాయించిన అడ్మినిస్ట్రేటీవ్ రిఫార్మ్స్ శాఖను తొలగించారు. పంజాబ్‌లో అలాంటి శాఖ ఒకటి లేనందునే ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిసింది.
గతంలో మంత్రి కుల్దీప్ సింగ్ ధనివాల్‌కు డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటీవ్ రిఫార్మ్స్ శాఖను కేటాయించారు. అయితే ప్రస్తుతం అది ఉనికిలో లేదు. అందుకే ఆ శాఖను మంత్రి వద్ద నుంచి తొలగించి కేవలం ఎన్ఐఆర్ వ్యవహారాల శాఖను మాత్రమే కొనసాగిస్తున్నామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ధనివాల్‌కు కేటాయించిన శాఖ అసలు ఉనికిలోనే లేదని తెలుసుకున్న తర్వాత ఆప్ ప్రభుత్వ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అయితే ఈ వివాదంపై మంత్రి ధనివాల్ స్పందిస్తూ.. అధికార ఆప్ ప్రభుత్వం ప్రజలు సేవ చేయాలని, పంజాబ్‌ను రక్షించాలని భావిస్తుందని చెప్పారు. సంబంధిత శాఖ ఉనికిలో లేదని మీరు పేపర్లలో చదవి ఉండొచ్చు. కానీ మేం ఇక్కడ సేవ చేయడానికి ఉన్నాం. పంజాబ్‌ను రక్షించడానికి ఉన్నామే కానీ కొత్త శాఖను తీసుకొని రావడానికి కాదు అసలు అది మా అజెండానే కాదని ధనివాల్ చెప్పారు.
గత ప్రభుత్వమే ఈ కొత్త శాఖను సృష్టించింది. అది మనుగడలో లేకపోవడానికి కారణం కూడా గత ప్రభుత్వానిదే బాధ్యత అని ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ అన్నారు. ఇక్కడ ప్రభుత్వం కింద ఒక శాఖ, యంత్రాంగం దగ్గర మరో శాఖ.. అమన్ అరోరా వద్ద ఇంకో శాఖ ఉంది. ఇప్పుడు వీటన్నింటినీ క్రమబద్దీకరించామని భగవంత్ సింగ్ మాన్ చెప్పారు. కాగా, పంజాబ్ ఆప్ చీఫ్ అమన్ అరోరా కూడా మంత్రిగా ఉన్నారు. ఆయన వద్ద కీలక శాఖలు ఉన్నాయి. ఐటీ, ఐ అండ్ పీఆర్, హౌసింగ్, అర్బన్ డెవలప్‌మెంట్ వంటి శాఖలను ఆయన చూస్తున్నారు.
లేని శాఖకు 20 నెలలుగా మంత్రి ఉన్నాడన్న విషయంపై పంజాబ్ బీజేపీ స్పందించింది. ఇదేనా కేజ్రివాల్ మోడల్ అంటూ చలోక్తులు విసిరింది. పంజాబ్‌లో పాలనను ఆప్ ఒక జోక్‌గా మార్చింది. 20 నెలలుగా ఒక మంత్రి లేని శాఖ బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే సీఎంకు అసలు ఆ విషయమే తెలియదంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోండని బీజేపీ విమర్శించింది.






