AI సమ్మిట్‌లో నిరసన ఎఫెక్ట్.. రాహుల్ ఇంటి వద్ద ఉద్రిక్తత.. బీజేపీ ఫైర్!

by Ramesh Naini |

దేశ రాజధానిలో జరుగుతున్న ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ సదస్సులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం అనూహ్య రీతిలో నిరసన తెలపడం ఉద్రిక్తతకు దారితీసింది.

AI సమ్మిట్‌లో నిరసన ఎఫెక్ట్.. రాహుల్ ఇంటి వద్ద ఉద్రిక్తత.. బీజేపీ ఫైర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధానిలో జరుగుతున్న ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ సదస్సులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం అనూహ్య రీతిలో నిరసన తెలపడం ఉద్రిక్తతకు దారితీసింది. అమెరికాతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని (Trade Deal) వ్యతిరేకిస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి నిరసన తెలపడంతో సదస్సులో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ తీరును "టాప్‌లెస్‌.. బ్రెయిన్‌ లెస్‌.. షేమ్‌ లెస్‌" అంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. అంతర్జాతీయ వేదికపై దేశ పరువు తీసేలా కాంగ్రెస్ ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసం వద్ద భారతీయ జనతా యువ మోర్చా (BJYM) భారీ నిరసన చేపట్టింది.ఈ మేరకు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బారికేడ్లతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

దేశ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర..

ఘటనపై కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ‘భారత్ గ్లోబల్ టెక్నాలజీ పవర్‌హౌస్‌గా ఎదుగుతున్న తరుణంలో, కాంగ్రెస్ దేశాన్ని అవమానించేందుకు ప్రయత్నిస్తోంది. ఇది కేవలం రాజకీయ వ్యతిరేకత కాదు, దేశ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర’ అని విమర్శించారు. బీజేపీ ప్రతినిధి నలిన్ కోహ్లీ మాట్లాడుతూ.. INC అంటే ‘యాంటీ నేషనల్ కాంగ్రెస్’ అని అభివర్ణించారు. కాగా, సదస్సు జరుగుతున్న సమయంలో యూత్ కాంగ్రెస్ నేతలు క్యూఆర్ కోడ్‌లను సంపాదించి హై-సెక్యూరిటీ జోన్‌లోకి ప్రవేశించారు. భారత్-అమెరికా ట్రేడ్ ఫ్రేమ్‌వర్క్ వల్ల భారత్‌కు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ వారు నినాదాలు చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న నలుగురు కీలక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కృష్ణ హరి, బీహార్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కుందన్ యాదవ్, యూపీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ కుమార్, జాతీయ కోఆర్డినేటర్ నరసింహ యాదవ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

వివాదానికి కారణమైన ‘ట్రేడ్ డీల్’

అమెరికాతో జరిగిన ఒప్పందం ప్రకారం.. అమెరికా నుంచి వచ్చే పారిశ్రామిక ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ టారిఫ్ (సుంకాలను) తగ్గించాల్సి ఉంటుంది. ప్రతిగా, భారతీయ ఉత్పత్తులపై అమెరికా 18 శాతం టారిఫ్‌ను విధిస్తుంది. ఈ ఒప్పందం వల్ల భారత్‌కు సరైన ప్రయోజనం కలగలేదని, ఇది దేశీయ రంగాలకు నష్టమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

Next Story