Pro-Khalistan Slogans: పంజాబ్ లో మరోసారి ఖలిస్థానీ నినాదాల కలకలం

by Shamantha N |

పంజాబ్‌లో మరోసారి ఖలిస్థానీ నినాదాలు కలకలం రేపాయి. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో పాగా వేసిన తీవ్రవాదుల ఏరివేతకు ఉద్దేశించిన ఆపరేషన్‌ బ్లూస్టార్‌ (Operation Blue Star)కు నేటితో 41 ఏళ్లు.

Pro-Khalistan Slogans: పంజాబ్ లో మరోసారి ఖలిస్థానీ నినాదాల కలకలం
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లో మరోసారి ఖలిస్థానీ నినాదాలు కలకలం రేపాయి. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో పాగా వేసిన తీవ్రవాదుల ఏరివేతకు ఉద్దేశించిన ఆపరేషన్‌ బ్లూస్టార్‌ (Operation Blue Star)కు నేటితో 41 ఏళ్లు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇదేరోజున జర్నైల్‌ సింగ్‌ భింద్రాన్‌ వాలే చనిపోయాడు. ఈసందర్భంగా అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయం (Amritsar Godlen Temple)లో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కొందరు ఖలిస్థాన్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేయడం కలకలం సృష్టించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిమ్రన్‌ సింగ్‌, ఆయన అనుచరులు, అకాల్‌ తఖ్త్‌ మాజీ జతేదార్‌ జస్బీర్‌ సింగ్ రోడ్‌ పాల్గొన్నారు. జస్బీర్ సింగ్ రోడ్ మాట్లాడుతూ.. “ఈ నినాదాలు ఇక్కడే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఎల్లప్పుడూ వినిపిస్తూనే ఉన్నాయి. ఇందులో కొత్తగా ఏమీ లేదు. సిక్కుల పవిత్ర స్థలంపై ఎందుకు దాడి జరిగిందనే దానికి నేటికీ ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. సిక్కులు తమ హక్కులను డిమాండ్ చేస్తున్నారు. వారు భారత ప్రభుత్వంపై దాడి ప్రకటించలేదు. అప్పుడు, ఎటువంటి నోటీసు లేదా హెచ్చరిక లేకుండా శత్రు దేశాలపై దాడి చేసినట్లు మాపై దాడి జరిగింది" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆపరేషన్ బ్లూ స్టార్

1984 జూన్‌ 1-10 వరకు ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ కొనసాగింది. పంజాబ్‌లో కొందరు స్వతంత్ర దేశం కావాలంటూ చేపట్టిన ఆందోళన ఖలిస్థాన్‌ ఉద్యమానికి దారితీసింది. 1980లో ఈ ఉద్యమం వివాదాస్పద నేత భింద్రాన్‌ వాలే అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని స్థావరంగా మార్చుకోవడం ఆందోళనలకు కారణమయ్యింది. ఈ ప్రార్థనాలయంలో దాక్కున్న తీవ్రవాదులను పట్టుకునేందుకు భారత సైన్యం (Indian Army) సైనిక చర్య చేపట్టింది. మేజర్‌ జనరల్‌ బ్రార్‌ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ‘ఆపరేషన్‌ బ్లూ స్టార్‌’.. భారత సైన్యం చేపట్టిన అతిపెద్ద సైనిక చర్యల్లో ఒకటిగా నిలిచింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు చేపట్టిన ఆ సైనిక చర్యలో 83 మంది భారత సైనికులు అమరులయ్యారు. వేర్పాటువాద నేతలూ హతమయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. దేశ చరిత్రలో ఓ మారణహోమానికి దారితీశాయి. ఆపరేషన్ బ్లూ స్టార్ వార్షికోత్సవానికి ముందు ఫిలౌర్ సమీపంలోని నంగల్ గ్రామంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ విగ్రహానికి నల్లరంగు పూశారు. నిషేధిత ఉగ్రసంస్థ సిక్క్స్ ఫర్ జస్టిస్ (SFJ) స్టాంప్ ను ఖలిస్థానీ జెండాతో అతికించారు. ఈ ఘటనకు సిక్కులు ఫర్ జస్టిస్ (SFJ) బాధ్యత వహించి, ఫుటేజ్‌ను విడుదల చేసి, అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసే ప్రచారానికి పిలుపునిచ్చింది.

Next Story