రాఘవ్ చద్దా ఇష్యూలో కొత్త ట్విస్ట్.. తెరవెనుక చక్రం తిప్పిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా!

by Gantepaka Srikanth |

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నేత రాఘవ్ చద్దా ఆ పార్టీకి రాజీనామా చేసి, భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

రాఘవ్ చద్దా ఇష్యూలో కొత్త ట్విస్ట్.. తెరవెనుక చక్రం తిప్పిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నేత రాఘవ్ చద్దా ఆ పార్టీకి రాజీనామా చేసి, భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే, ఈ పరిణామం వెనుక గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఉన్నారంటూ పంజాబ్ మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, మాజీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. రాఘవ్ చద్దా ఆప్ (AAP) నుంచి బయటకు రావడంలో ఆయన భార్య పరిణీతి చోప్రా సోదరి (కజిన్) అయిన ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషించారని నవజ్యోత్ కౌర్ ఆరోపించారు. ఇటీవల ప్రియాంక చోప్రా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారని, ఆ సమయంలో తన బావ (రాఘవ్ చద్దా) విషయంపై మాట్లాడి, ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోరినట్లు కౌర్ పేర్కొన్నారు.

కేజ్రీవాల్ మౌనం వెనుక రహస్యం..

రాఘవ్ చద్దా రాజీనామా చేసినా అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు గట్టిగా స్పందించడం లేదంటే.. దాని వెనుక ప్రియాంక చోప్రా ప్రభావమే ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్‌కు సైతం రాఘవ్ విషయంలో హద్దులు దాటి వెళ్లవద్దని సూచనలు అందాయని ఆమె వ్యాఖ్యానించారు. గత 14 ఏళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతగా ఎదిగిన రాఘవ్ చద్దా, ఏప్రిల్ 24న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆయన తదుపరి రాజకీయ ప్రయాణం బీజేపీతో ఉంటుందని స్పష్టం చేశారు. రాజ్యసభలో పార్టీ బాధ్యతల నుంచి తొలగించిన కొన్ని రోజులకే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. రాఘవ్ చద్దా బీజేపీలోకి వెళ్లడాన్ని వ్యతిరేకిస్తూ ముంబైలో కొంతమంది నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్నారంటూ విమర్శలు వస్తుండగా, నవజ్యోత్ కౌర్ సిద్ధూ చేసిన 'ప్రియాంక చోప్రా' కామెంట్స్ ఈ వివాదానికి సరికొత్త యాంగిల్‌ను జోడించాయి.

Next Story