కాంగ్రెస్‌ను కాకరకాయతో పోల్చిన మోడీ.. ఇంకా ఏమన్నారంటే..

by Dishanational4 |
కాంగ్రెస్‌ను కాకరకాయతో పోల్చిన మోడీ.. ఇంకా ఏమన్నారంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీని చేదు కాకరకాయతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోల్చారు. కాకర కాయను నెయ్యిలో వేయించినా, పంచదారను కలిపినా రుచి ఎప్పటికీ మారదన్నారు. దేశంలో ప్రస్తుతమున్న అన్ని సమస్యలకు కాంగ్రెస్ పార్టీయే మూల కారణమని ప్రధాని చెప్పారు. 2019లో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఏకైక లోక్‌సభ స్థానం చంద్రాపూర్‌లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మత ప్రాతిపదికన దేశ విభజనకు కారణం ఎవరు ? కాశ్మీర్ సమస్యకు, నక్సలిజానికి కారణమెవరు ? రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించి, రాముడి ఉనికిని ప్రశ్నించిన వారెవరు ? రామ మందిరం ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని తిరస్కరించిన వారు ఎవరు ?’’ అని మోడీ కామెంట్స్ చేశారు. ‘‘138 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ తన చర్యల వల్ల ప్రజల మద్దతును కోల్పోయింది. ఇటీవల విడుదల చేసిన ఆ పార్టీ మేనిఫెస్టోలో విభజన అనుకూల ముస్లిం లీగ్ ముద్ర ఉంది’’ అని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలు అవినీతిలో మునిగితేలడం కోసమే కూటమిగా ఏర్పడ్డాయన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికలను సుస్థిరత, అస్థిరతల మధ్య జరుగుతున్న పోరుగా మోడీ అభివర్ణించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి, ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి చంద్రాపూర్‌ కలపను ఉపయోగించిన విషయాన్ని ఈసందర్భంగా ప్రధానమంత్రి గుర్తు చేశారు.

రాజీవ్‌గాంధీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..

దశాబ్దాల తరబడి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దోపిడీ లైసెన్సును తాను రద్దు చేశానని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నిర్వహించిన ‘విజయ సంకల్ప్ శంఖానాద్’లో ప్రధాని ప్రసంగించారు. దేశంలో అభివృద్ధి పనులకు కేటాయించిన ప్రతి రూపాయిలో 15 పైసలే సరైన లబ్ధిదారులకు చేరిందని స్వయంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ లెక్కన మిగిలిన 85 పైసలు ఎవరి చేతుల్లోకి వెళ్లాయో అర్థం చేసుకోవచ్చని మోడీ కామెంట్ చేశారు. గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ. 34 లక్షల కోట్లు జమ చేసిందన్నారు. ఢిల్లీ నుంచి పంపిన ప్రతి రూపాయి పేదల ఖాతాలకు చేరిందని పేర్కొన్నారు. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే.. రూ. 34 లక్షల కోట్లలో రూ. 28 లక్షల కోట్ల అవినీతి జరిగి ఉండేదని ప్రధాని ఆరోపించారు.ప్రజలు తనకు అధికారం ఇచ్చినందున.. కాంగ్రెస్ పార్టీ దోపిడీ లైసెన్స్‌ను రద్దు చేయగలిగానని తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed