Women's Reservation Bill : మహిళా సాధికారతపై ఉపన్యాసాలు ఇస్తే సరిసోదు: మోడీ

by Disha Web Desk 2 |
Womens Reservation Bill : మహిళా సాధికారతపై ఉపన్యాసాలు ఇస్తే సరిసోదు: మోడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాత పార్లమెంట్ సెంట్రల్ హల్లో మీటింగ్ అనంతరం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి ప్రధాని ఆధ్వర్యంలో ఉభయ సభల ఎంపీలు చేరుకున్నారు. జాతీయ గీతంతో కొత్త పార్లమెంట్‌లో సమావేశాలు ప్రారంభించారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఇది ఎంతో చారిత్రాత్మకమైందన్నారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో సెంగోల్ ది కీలక పాత్ర ఉందని, నెహ్రూ చేతికి శోభనిచ్చిన సెంగోల్ నేడు సభలో కొలువుదీరిందన్నారు. గత చేదు అనుభవాలను మర్చిపోయి.. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఆజాదీ అమృత్ కాలంలో ఇది ఉషోదయ కాలమన్నారు. వినాయక చవితి రోజు కొత్త పార్లమెంటులో అడుగుపెట్టామని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యమన్నారు. మహిళలు ఇవాళ అన్ని రంగాల్లో ముందున్నారని హర్షం వ్యక్తంచేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ‘నారీ శక్తి వందన్ అధినీయం’ పేరును పెట్టారు.

మహిళల కోట చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. మహిళా సాధికారతపై ఉపన్యాసాలు ఇస్తే సరిసోదన్నారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించే భాగ్యం భగవంతుడు తనకు కల్పించాడని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముందడుగు చేయబోతున్నామని, నారీ శక్తి బిల్లును చట్టం చేయడానికి కట్టుబడి ఉన్నామని, ఈ రోజు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుందన్నారు. ఇదిలా ఉండగా 2.30 గంటలకు రాజ్యసభ సమావేశాలు ప్రారంభం అవుతాయి. 3 గంటలకు లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును న్యాయమంత్రి అర్జున్ మేఘ్వాల్ ప్రవేశ పెట్టనున్నారు. కాగా, మహిళా రిజర్వేషన్ బిల్లు 2024 ఎన్నికలకి వర్తించదు. జనగణన పూర్తయిన తర్వాత నియోజక వర్గాల విభజన జరిగిన అనంతరం మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తుంది.

Next Story

Most Viewed