Prime Minister Modi : రేపటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన

by Y. Venkata Narasimha Reddy |
Prime Minister Modi : రేపటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఫ్రాన్స్(France), అమెరికా(America) పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 10నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్ లో, 12, 13 తేదీల్లో అమెరికాలో ఆయన పర్యటించనున్నారు. పారిస్ లో జరిగే కృత్రిమ మేధ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 10వ తేదీన మోదీ ఫ్రాన్సుకు వెళ్లనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ (Emmanuel Macron)తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రధాని తన ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా కెడారచీ ధర్మో న్యూక్లియర్ ఎక్స్ పెరిమెంటల్ రియాక్టర్ ను పరిశీలిస్తారు. అనంతరం 12వ తేదీ సాయంత్రానికి మోదీ అన అమెరికా పర్యటన నిమిత్తం వాషింగ్టన్ డీసీకి చేరుకుంటారు. 13వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో భేటీ అవుతారు.

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భేటీ కాబోతున్న ప్రధాని మోదీ.. ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముందని విదేశాంగ వర్గాలు వెల్లడించాయి. ట్రంప్ ప్రభుత్వం పలు దేశాలపై భారీగా టారిఫ్ లు విధిస్తుండట..అమెరికాలో నివసిస్తున్న భారతీయ అక్రమ వలసదార్లను వెనక్కి పంపిస్తున్న సమయంలో మోదీ, ట్రంప్ సమావేశం కాబోతుండటం ఆసక్తికరంగా మారింది. భారతీయ అక్రమ వలసదార్లపై కఠినంగా వ్యవహరించకుండా మోదీ తన మిత్రుడైన ట్రంప్ను ఒప్పిస్తారా? అనేది వేచి చూడాలి. భారత్-అమెరికా మధ్య వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలపై వారు విస్తృతంగా చర్చించబోతున్నట్లు సమాచారం. మోదీ చివరిసారిగా 2024 సెప్టెంబర్లో అమెరికాలో పర్యటించారు. క్వాడ్ దేశాల అధినేతల సదస్సులో పాల్గొన్నారు.

కాగా మోదీ అమెరికా పర్యటనతో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలియజేశారు. ఇరుదేశాల మధ్య పరస్పర సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలు, కీలక రంగాల్లో భాగస్వామ్యంపై మోదీ, ట్రంప్ చర్చిస్తారని వివరించారు. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం కొలువుదీరిన మూడు వారాల్లోపే నరేంద్ర మోదీకి ఆహ్వానం అందిందని అన్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా ట్రంప్ ప్రభుత్వం ఆయనను ఆహ్వానించిందని చెప్పారు. ఇండియాతో భాగస్వామ్యానికి అమెరికా ఇస్తున్న ప్రాధాన్యతకు ఇదొక ప్రతీక అని విక్రమ్ మిస్త్రీ వివరించారు. ఇరు దేశాల నడుమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉందని.. ఇంధన భద్రత, కృత్రిమ మేధ(ఐఎ) వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకొనేలా నిర్ణయాలకు అవకాశముందని చెప్పారు.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనతో మాట్లాడిన అతికొద్ది మంది ప్రపంచ దేశాల నేతల్లో మోదీ కూడా ఉన్నారు. గతవారం కూడా ఇరువురు నేతలు ఫోన్లో మాట్లాడుకున్నారు. వలసలు, భద్రత, వాణిజ్య సంబంధాలపై వారు చర్చించుకున్నారు. ట్రంప్, మోదీ మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయని వైట్ హౌస్ ప్రకటించింది. ట్రంప్ తో మోదీకి చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ తనకు ప్రియమిత్రుడు అని మోదీ చెబుతుంటారు. అటు ట్రంప్ కూడా మోదీ గొప్ప నాయకుడు అని ప్రశంసించారు. అయితే, ఇండియాలో అమెరికా ఉత్పత్తులపై టారిఫ్ లు అధికంగా విధిస్తున్నారని ట్రంప్ ఆక్షేపించారు. ఇండియాను టారిఫ్ కింగ్ అభివర్ణించారు. ప్రధాని మోదీ తన అమెరికా పర్యటనలో ఎలాన్ మస్క్ సహా ప్రముఖ వ్యాపారవేత్తలతో మోదీ సమావేశం కానున్నారు.

Advertisement
Next Story