బీజేపీ ఆఫీసులో విక్టరీ సెలబ్రేషన్స్.. నయా లుక్‌లో ప్రధాని మోడీ

by Gantepaka Srikanth |

దేశవ్యాప్త ఉత్కంఠకు తెరదించుతూ వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) జైత్రయాత్ర కొనసాగించింది.

బీజేపీ ఆఫీసులో విక్టరీ సెలబ్రేషన్స్.. నయా లుక్‌లో ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్త ఉత్కంఠకు తెరదించుతూ వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) జైత్రయాత్ర కొనసాగించింది. పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు పుదుచ్చేరిలో పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం విజయోత్సవ సంబరాలతో హోరెత్తిపోయింది. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వేషధారణతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎప్పుడూ కుర్తా-పైజామా లేదా జాకెట్‌తో కనిపించే ప్రధాని మోడీ, ఈసారి విజయోత్సవ వేడుకలకు సరికొత్త వేషధారణలో హాజరయ్యారు. బెంగాల్, దక్షిణాది సంస్కృతిని ప్రతిబింబించేలా ఆయన తొలిసారిగా పంచెకట్టులో ప్రత్యక్షమయ్యారు. ప్రధాని నయా లుక్ చూసి పార్టీ కార్యకర్తలు, అభిమానులు కేరింతలు కొట్టారు.

దిగ్గజ నేతల సమక్షంలో సంబరాలు..

ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర అగ్రనేతలు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ 'భారత్ మాతా కీ జై' నినాదాలతో హోరెత్తించారు. విజయోత్సవ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.. "పశ్చిమ బెంగాల్ గడ్డపై కమలం వికసించింది. అస్సాం, పుదుచ్చేరి ప్రజలు కూడా అభివృద్ధికి పట్టం కట్టారు" అని పేర్కొన్నారు. ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకమే ఈ విజయానికి పునాది అని, ఇది పార్టీ విజయం మాత్రమే కాదు.. ప్రజల విజయమని అభివర్ణించారు. ప్రాణాలకు తెగించి, అహోరాత్రులు శ్రమించిన ప్రతి కార్యకర్తకు ప్రధాని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బెంగాల్‌లో టీఎంసీ కోటను బద్దలు కొట్టి, బీజేపీ మొదటిసారిగా అధికారాన్ని చేపట్టబోతుండటం దేశ రాజకీయాల్లోనే మైలురాయిగా నిలిచింది. అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, పుదుచ్చేరిలోనూ కమలం జెండా ఎగరడం బీజేపీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది.

Next Story