ఉద్యోగం మానేసిన భర్త.. గర్భిణీ భార్య పట్ల యజమాని, అనుచరుల దాష్టీకం.. ఇనుపరాడ్లతో..

by Naga Rani Yarlagadda |

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లోని గోలా ప్రాంతంలో అమానుషమైన, అమానవీయమైన ఘటన వెలుగుచూసింది.

ఉద్యోగం మానేసిన భర్త.. గర్భిణీ భార్య పట్ల యజమాని, అనుచరుల దాష్టీకం.. ఇనుపరాడ్లతో..
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లోని గోలా ప్రాంతంలో అమానుషమైన, అమానవీయమైన ఘటన వెలుగుచూసింది. భర్త పని మానేయడంతో అతని గర్భిణీ భార్యపై దాడి, బలవంతంగా గుంజీలు తీయించాడో దుర్మార్గుడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కౌవాడిల్ గ్రామానికి చెందిన శివం శర్మ (24).. రతన్ భరద్వాజ్ మసాలా దుకాణంలో నెలకు రూ. 7,000 జీతానికి పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులను పేర్కొంటూ.. అతను దాదాపు 10 రోజుల క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

జూలై 18న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భరద్వాజ్, అతని సహచరులలో ఒకరైన కుష్ శర్మ.. శివం నివాసంలోకి చొరబడి కర్రలు, ఇటుకలు, బెల్టులు, ఇనుప రాడ్‌లతో అతనిపై దారుణంగా దాడి చేశారని పోలీసులు తెలిపారు. గర్భవతి అయిన అతని భార్య ఖుష్బూ ఈ గొడవలో జోక్యం చేసుకోవడంతో ఆమెను నేలపై పడేసి గాయపరిచారు. ఆ తర్వాత దాడి చేసిన వ్యక్తులు ఆమెను 25 గుంజీలు తీయమని బలవంతం చేశారని, దీని వలన ఆమె పరిస్థితి మరింత దిగజారిందని బాధితురాలు తరువాత కుప్పకూలిపోయిందని ఆమె కుటుంబం తెలిపింది. దాడిని ఆపమని శివం 75 ఏళ్ల తండ్రి కూడా నిందితులను వేడుకున్నాడు. కానీ అతని విజ్ఞప్తిని పట్టించుకోలేదని బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. భరద్వాజ్ నిత్యం అక్రమ తుపాకీని కలిగి ఉంటాడని శివం తన ఫిర్యాదులో ఆరోపించారు. భరద్వాజ్ తండ్రి, రిటైర్డ్ పోలీసు కానిస్టేబుల్ ముఖేష్ శర్మ, అతని మామ మురారి శర్మ నేర నేపథ్యం కలిగి ఉన్నారని కూడా ఆయన ఆరోపించారు. శివం ఫిర్యాదుతో రతన్ భరద్వాజ్, కుష్ శర్మలపై సోమవారం BNSలోని సంబంధిత సెక్షన్ల కింద FIR నమోదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) గోలం అంజుల్ కుమార్ తెలిపారు. నిందితులు ఇద్దరూ ప్రస్తుతం పరారీలో ఉండగా వారి కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

Next Story