ఆధార్ కార్డు విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, చేయకూడని తప్పులివే!

by D.Reddy |
ఆధార్ కార్డు విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, చేయకూడని తప్పులివే!
X

దిశ, వెబ్ డెస్క్: భారత పౌరులకు ఆధార్ కార్డు ముఖ్యమైన డాక్యుమెంట్ అన్న సంగతి తెలిసిందే. తొలుత దీన్ని ఒక గుర్తింపు కార్డుగా మాత్రమే భావించారు. కానీ కాల క్రమంలో దీని ప్రాముఖ్యత విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ఆధార్​ వివరాలు చోరీ చేసి కేటుగాళ్లు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. ఈక్రమంలో ఆధార్‌ కార్డ్‌ విషయంలో చేయాల్సిన, చేయకూడని పనుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఆధార్‌ కార్డ్ విషయంలో తప్పనిసరి పాటించాల్సిన జాగ్రత్తలు

* ఎల్లప్పుడూ UIDAI వెబ్‌సైట్ ద్వారానే ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

* ప్రతి ఆరు నెలలకు ఒకసారి UIDAI వెబ్‌సైట్ లేదా m-Aadhaar యాప్‌లో మీ ఆధార్ అథెంటికేషన్‌ హిస్టరీని కచ్చితంగా చెక్‌ చేసుకోవాలి. ఇలా ఎప్పటికప్పుడు డేటా చెక్ చేసుకుంటే.. యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ ఎక్కడ ఉపయోగించారు అనే వివరాలను తెలుసుకోవచ్చు.

* UIDAI ఈ-మెయిల్ ద్వారా ఆధార్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది. కాబట్టి ఆధార్ నంబర్‌తో ఈ-మెయిల్‌ని లింక్ చేసుకోవటం మంచిది.

* ఆధార్‌కు మొబైల్ నంబర్‌ను లింక్‌ చేయండి. దీని ద్వారా OTP సేవలను పొందవచ్చు. అప్పుడు ఎవరైనా మీ ఆధార్‌ను ఉపయోగించాలని చూస్తే.. మీకు OTP వస్తుంది. అది ఎంటర్ చేస్తేనే వారికి యాక్సెస్ లభిస్తుంది. కాబట్టి అందరూ మొబైల్ నంబర్‌తో లింక్ చేసుకోవాలి.

* ఆధార్‌ కార్డ్‌లో మన వేలి ముద్రలు, ఫొటో, ఐరిస్‌ స్కాన్‌ వంటి ఎన్నో వ్యక్తిగత విషయాలుంటాయి. కాబట్టి, ఎవరికైనా తెలియని వ్యక్తులకు ఆధార్‌ కార్డ్‌ను ఇచ్చే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి.

* మీ ఆధార్‌ కార్డ్‌ను బయోమెట్రిక్‌ లాకింగ్‌ చేసుకోండి. లాక్ చేసిన తర్వాత.. మీరు ఎక్కడైనా వేలి ముద్రలు వేయాలంటే.. ముందుగా బయోమెట్రిక్‌ను ఆన్‌లాక్‌ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మీ ఆధార్ సురక్షితంగా ఉంటుంది.

* ఆధార్‌ కార్డ్ దుర్వినియోగం అయినట్లు గమనిస్తే వెంటనే చర్య తీసుకోవచ్చు. ఏదైనా వ్యత్యాసాన్ని గమనిస్తే 1947 లేదా [email protected]కి సమస్యను వివరించవచ్చు.

ఆధార్‌ విషయంలో ఈ తప్పులు అస్సలు చేయవద్దు

* ఆధార్ వివరాలను బహిరంగంగా షేర్ చేయవద్దు. ముఖ్యంగా Facebook, Instagram, whatsapp, ట్విట్టర్‌ వంటి పబ్లిక్ డొమైన్‌లో పోస్ట్‌ చేయకూడదు.

* ఆధార్ లెటర్, PVC కార్డ్ లేదా కాపీలను ఎట్టిపరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశాల్లో పడేయకూడదు.

* ఆధార్‌ OTPలను ఎవ్వరికీ షేర్‌ చేయవద్దు.

* మీ m-Aadhaar PINను ఎవరితోనూ పంచుకోవద్దు.

Next Story

Most Viewed