ప్రజ్వల్ రేవణ్ణ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్.. మాట మార్చిన మహిళ

by Disha Web Desk 17 |
ప్రజ్వల్ రేవణ్ణ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్.. మాట మార్చిన మహిళ
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో సంచలనం సృష్టించిన హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సివిల్ యూనిఫాం ధరించి పోలీసు అధికారులుగా పేర్కొన్న ముగ్గురు వ్యక్తులు తనను బెదిరించి ప్రజ్వల్ రేవణ్ణపై తప్పుడు ఫిర్యాదు చేసేలా ఒత్తిడి చేశారని ఒక మహిళ పేర్కొన్నట్టు జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) తెలిపింది. దీనిపై స్పందించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)పై, రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది. బాధితులు ఎక్కడ ఉన్నారు? 2,900 మందికి పైగా బాధితులు ఉన్నారని కాంగ్రెస్ చెబుతోంది, కానీ వారు ఎక్కడ ఉన్నారు? అని కుమారస్వామి ప్రశ్నించారు. జేడీఎస్ ప్రతినిధి బృందం కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌తో సమావేశమై, ఈ కేసుపై "నిష్పాక్షిక విచారణ" కోసం అభ్యర్థిస్తూ లేఖను సమర్పించింది.

ప్రజ్వల్ రేవణ్ణ కేసులో కర్ణాటక పోలీసులు తప్పుడు వాంగ్మూలం ఇవ్వమని చెప్పారని ఆరోపిస్తున్న మహిళను తాము సంప్రదించలేదని సిట్ తెలిపినట్లు సమాచారం. అలాగే మహిళకు ఫోన్ల ద్వారా బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో వారి వివరాలను తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించింది, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ పేర్కొంది. మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ, ఆయన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో మే 5వ తేదీన హెచ్‌డి రేవణ్ణను సిట్ అరెస్టు చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం విదేశాలకు పారిపోయాడు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed