- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రముఖ నటుడు దర్శన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. మరో ఏడాది పాటు జైలులోనే!
ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2024 నాటి రేణుకాస్వామి హత్య కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2024 నాటి రేణుకాస్వామి హత్య కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు శుక్రవారం జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్ కోర్టులో విచారణ నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మొత్తం 150 మంది సాక్షులను విచారించాల్సి ఉండగా, గత ఏడు నెలల్లో కేవలం 10 మందిని మాత్రమే విచారించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ఒకవేళ వచ్చే ఏడాది కాలంలో విచారణలో ‘గణనీయమైన పురోగతి’ లేకపోతే, అప్పుడు మాత్రమే మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని దర్శన్‌కు వెసులుబాటు కల్పించింది. అంటే, మరో ఏడాది వరకు ఆయనకు బెయిల్ లభించే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
కోర్టు కీలక వ్యాఖ్యలు - ఆదేశాలు
ఇదే వేగంతో సాగితే 60 మంది ప్రధాన సాక్షుల విచారణ పూర్తి కావడానికే చాలా కాలం పడుతుందని కోర్టు అభిప్రాయపడింది. విచారణను వాయిదా వేయకుండా, అవసరమైతే రోజువారీ విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. ప్రస్తుతం ట్రయల్ కోర్టు జడ్జి అదనపు బాధ్యతల్లో ఉండటం వల్ల విచారణ ఆలస్యమవుతోందని దర్శన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. వెంటనే రెగ్యులర్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌ను నియమించేలా చర్యలు తీసుకోవాలని కర్ణాటక హైకోర్టుకు సూచించింది.
వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు
తనను క్వారంటైన్ సెల్‌లో ఉంచి ప్రాథమిక సౌకర్యాలు నిరాకరిస్తున్నారని దర్శన్ ఆరోపించగా.. జైలు నిబంధనల ప్రకారం అతనికి అందాల్సిన అన్ని కనీస వసతులు కల్పించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. అయితే, గతంలో ఆయనకు అందిన ‘ప్రత్యేక మర్యాదల’ను దృష్టిలో ఉంచుకుని, ఎట్టి పరిస్థితుల్లోనూ వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వకూడదని స్పష్టం చేసింది. తన స్నేహితురాలు పవిత్ర గౌడకు అసభ్యకర సందేశాలు పంపాడన్న కోపంతో, 33 ఏళ్ల రేణుకాస్వామిని దర్శన్, అతని గ్యాంగ్ కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జూన్ 11, 2024న అరెస్ట్ అయిన దర్శన్, అప్పటి నుంచి జైలులోనే ఉంటున్నారు. మొదట బెయిల్ లభించినప్పటికీ, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న కారణంతో సుప్రీంకోర్టు గతంలోనే దానిని రద్దు చేసింది.






