Pollution: భారత్‌లోనే అత్యంత కాలుష్య నగరాలు.. ఐక్యూ ఎయిర్ నివేదికలో వెల్లడి

by B.Srinivas |

ప్రపంచంలో రోజు రోజుకూ కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. పలు నగరాల్లో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతున్నది.

Pollution: భారత్‌లోనే అత్యంత కాలుష్య నగరాలు.. ఐక్యూ ఎయిర్ నివేదికలో వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలో రోజు రోజుకూ కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. పొల్యూషన్ (Pollution) వల్ల పలు నగరాల్లో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతున్నది. అంతేగాక కాలుష్య ప్రభావంతో ప్రజలు పలు రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే తాజాగా స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్ (IQAir) రూపొందించిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్-2024 నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని టాప్ 20 అత్యంత కాలుష్య నగరాల్లో 13 భారత్‌లోనే ఉన్నాయి. అసోంలోని బైర్నిహాట్ సిటీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అంతేగాక ప్రపంచంలోని అత్యంత కలుషితమైన రాజధాని నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉన్నట్టు నివేదిక తెలిపింది. అత్యంత కాలుష్య పూరిత దేశాల్లో 2023లో భారత్ ప్రపంచంలో మూడో అత్యంత కాలుష్య దేశంగా ఉండగా 2024 నాటికి కాస్త మెరుగుపడి ఐదో స్థానంలో నిలిచింది.

2024లో పీఎం 2.5 స్థాయి సగటున క్యూబిక్ మీటర్‌కు 50.6 మైక్రోగ్రాములుగా ఉండగా.. 2023లో ఇది క్యూబిక్ మీటర్‌కు 54.4 మైక్రోగ్రాములుగా ఉంది. అంటే గతేడాది కన్న 7 శాతం పీఎం గాఢత తగ్గింది. అయినప్పటికీ ప్రపంచంలోని అత్యంత కాలుష్యనగరాలు భారత్‌లోనే ఉండటం గమనార్హం. ఇక, దేశ రాజధానిలో కాలుష్యం తీవ్రత మరింత పెరుగుతూనే ఉంది. ఈ ప్రాంతంలో పీఎం2.5 సాంద్రత క్యూబిక్‌ మీటర్‌కు 2023లో 91.6 మైక్రోగ్రాములు ఉండగా, 2024లోనూ ఏ మాత్రం మారకుండా 92.7 మైక్రోగ్రాములుగా ఉంది. అలాగే భారతదేశంలోని 35 శాతం నగరాల్లో వార్షిక PM2.5 స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితి కంటే 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది.

టాప్‌-20లోని భారత నగరాలివే

ప్రపంచంలోని టాప్‌ 20 అత్యంత కాలుష్య నగరాల జాబితాలో అసోంలోని బైర్నిహాట్, ఢిల్లీ, పంజాబ్‌లోని ముల్హన్‌పుర్‌, ఫరీదాబాద్‌, లోని, గురుగ్రామ్‌, గంగానగర్‌, గ్రేటర్ నోయిడా, భివాడి, ముజఫర్‌నగర్‌, హనుమాన్‌గఢ్‌, నోయిడాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్టరీల వల్లే అధిక కాలుష్యం నమోదవుతోందని పలువురు వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.

Next Story