EC: ఓటర్ల జాబితాతో బర్త్, డెత్ రికార్డుల లింక్

by S Gopi |

ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసేందుకు ఎలక్ట్రానిక్స్ విధానంలో వివరాలను తీసుకుంటామని ఈసీ పేర్కొంది.

EC: ఓటర్ల జాబితాతో బర్త్, డెత్ రికార్డుల లింక్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన విడుదల చేసింది. బర్త్, డెత్ రికార్డులతో ఓటర్ల జాబితాను అనుసంధానం చేయనున్నట్టు గురువారం ప్రకటనలో వెల్లడించింది. ఓటర్ల జాబితాకు సంబంధించి ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం, పౌరులకు ఓటింగ్ ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా చేయడం కోసం దీన్ని ప్రవేశపెట్టింది. దీనికోసం ఎన్నికల సంఘం(ఈసీ) ఇప్పుడు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ) నుంచి మరణ నమోదుల గణాంకాలను సేకరించనుంది. ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసేందుకు ఎలక్ట్రానిక్స్ విధానంలో వివరాలను తీసుకుంటామని ఈసీ పేర్కొంది. ఈ ప్రక్రియ ద్వారా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు(ఈఆర్ఓ) మరణించిన వారి సమాచారం నేరుగా ఆర్‌జీఐ ద్వారా తీసుకుంటారు. దీని వల్ల మరణించిన వారి కుటుంబం నుంచి ఫామ్-7 కింద వివరాలు అందేవరకు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. అనంతరం బూత్ స్థాయి అధికారులు(బీఎల్ఓ) క్షేత్రస్థాయిలో సమాచారాన్ని మరోసారి ధృవీకరిస్తారు. ఎన్నికల నిబంధనలు-1960తో పాటు జనన, మరణాల నమోదు చట్టం-1969 ప్రకారం ఈసీకి ఈ సమాచారం సేకరించే అధికారం ఉంది.

బీఎల్ఓలకు ఐడీ కార్డులు

ఇదే సమయంలో బూత్ స్థాయి అధికారులకు కూడా ఇకపై ఫోటో ఐటీ కార్డులు ఇవ్వనున్నట్టు ఈసీ తెలిపింది. దీనివల్ల ఓటరు ధృవీకరణ, రిజిస్ట్రేషన్ డ్రైవ్ సమయంలో ప్రజలు బీఎల్ఓ అధికారులను గుర్తించడం సులభమవుతుందని వెల్లడించింది. ఇదికాకుండా, ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌లో సమాచారం స్పష్టంగా కనిపించడానికి వీలుగా డిజైన్ మార్పులు చేయనున్నట్టు ఈసీ స్పష్టం చేసింది. ఓటర్ల సీరియల్, పార్ట్ నంబర్లు మరింత పెద్దగా కనిపించేలా మార్చనున్నారు. దీనివల్ల ఓటర్లు పోలింగ్ స్టేషన్లను సులభంగా గుర్తించవచ్చని, పోలింగ్ అధికారులు కూడా పేర్లను చెక్ చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది.

Next Story