'పాయింట్ బ్లాంక్' కాల్పులు? అస్సాం సీఎం వీడియోపై రేగిన రాజకీయ దుమారం.. డిలీట్ చేసిన బీజేపీ

by Ramesh Naini |

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేతిలో తుపాకీ పట్టుకుని, ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నట్లు చిత్రీకరించిన ఒక వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది.

పాయింట్ బ్లాంక్ కాల్పులు? అస్సాం సీఎం వీడియోపై రేగిన రాజకీయ దుమారం.. డిలీట్ చేసిన బీజేపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేతిలో తుపాకీ పట్టుకుని, ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నట్లు చిత్రీకరించిన ఒక వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది. బీజేపీ అస్సాం అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో.. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిగివచ్చిన బీజేపీ ఐటీ విభాగం ఆ పోస్టును తొలగించింది.

వీడియోలో ఏముంది?

"పాయింట్ బ్లాంక్ షాట్" (Point blank shot) అనే క్యాప్షన్‌తో శనివారం బీజేపీ అస్సాం ప్రదేశ్ పోస్ట్ చేసిన వీడియోలో.. సీఎం హిమంత ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఎయిర్ రైఫిల్ పరీక్షిస్తున్న వాస్తవ దృశ్యాలను తీసుకున్నారు. దీనికి కృత్రిమ మేధ (AI) సాంకేతికతను జోడించి, సీఎం పేల్చిన బుల్లెట్లు.. ఒక మతానికి చెందిన సంప్రదాయ వేషధారణలో (గడ్డం, టోపీలు ధరించిన) ఉన్న వ్యక్తులకు తగులుతున్నట్లు గ్రాఫిక్స్ సృష్టించారు. సీఎంను ఒక యాక్షన్ సినిమా హీరోలా ఎలివేట్ చేస్తూ ఈ వీడియోను రూపొందించారు. రెచ్చగొట్టే నినాదాలు వీడియోలో దృశ్యాలతో పాటు స్క్రీన్‌పై వచ్చిన రాతలు (Text) మరింత వివాదానికి దారితీశాయి.

"విదేశీ రహిత అస్సాం" (Foreigner free Assam), "దయ లేదు" (No Mercy), "మీరు పాకిస్థాన్ ఎందుకు వెళ్లలేదు?", "బంగ్లాదేశీయులకు క్షమాపణ లేదు" వంటి వాక్యాలు అందులో కనిపించాయి. ఇది నేరుగా ఒక వర్గాన్ని టార్గెట్ చేయడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.రాజ్యాంగ విలువలపై దాడి చేస్తూ, విద్వేషాన్ని (Hate Speech) రగిలిస్తున్నారంటూ సీఎం హిమంతపై ప్రముఖ హక్కుల కార్యకర్త హర్ష్ మందర్ ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్రమైన వ్యతిరేకత రావడంతో బీజేపీ ఈ వీడియోను డిలీట్ చేసినప్పటికీ, ప్రతిపక్షాలు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాయి.

Next Story