యూఏఈ పర్యటనలో మూడోసారి గెలుపుపై ప్రధాని మోడీ ధీమా

by Dishanational1 |
యూఏఈ పర్యటనలో మూడోసారి గెలుపుపై ప్రధాని మోడీ ధీమా
X

దిశ, నేషనల్ బ్యూరో: అబుదాబిలో మంగళవారం నిర్వహించిన భారీ సాంస్కృతిక 'అహ్‌లాన్‌ మోదీ' కార్యక్రమంలో వేలాది మంది ప్రవాస భారతీయులనుద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ప్రతి ఒక్కరి గుండె చప్పుడు 'భారత్‌- యూఏఈ దోస్తీ జిందాబాద్‌' అని నినదిస్తున్నదన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయని, దీన్ని తన మూడో టర్మ్ పదవీకాలంలోనూ కొనసాగించనున్నట్టు తెలిపారు. తాను ఏడవసారి సందర్శిస్తున్న గల్ఫ్ దేశంతో పెరుగుతున్న భాగస్వామ్యానికి కారణమైన ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలు తెలిపారు. 'మోడీ హామీ అంటే ప్రతి హామీ నెరవేరుతుంది' అని ప్రధాని ప్రకటించారు. 'భారత్, యూఏఈ మధ్య స్నేహాన్ని ప్రశంసించాల్సిన సమయం ఇది. గత తొమ్మిదేళ్లలో వాణిజ్యం, రక్షణ, ఆహారం, ఇంధన భద్రత, విద్య వంటి రంగాలలో యూఏఈతో భారత్ భాగస్వామ్యం పెరిగింది. 2022-23లో సుమారు 85 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో రెండు దేశాలు ఒకదానికొకటి అగ్ర వాణిజ్య భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, ఏడో అతిపెద్ద పెట్టుబడిదారుగా యూఏఈ ఉంది. యూఏఈ విద్యాసంస్థల్లో 1.5 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారని' మోడీ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి సహాకారం అందించిన యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను మోడీ సోదరుడిగా పదే పదే ప్రస్తావించారు.

అలాగే, యూఏఈ పర్యటన సందర్భంగా మోడీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. వాణిజ్య, పెట్టుబడులు, ఇంధన, డిజిటల్ రంగాల్లో సంబంధాలను మరింత విస్తరించేందుకు మాట్లాడుకున్నారు. ఇద్దరి సమక్షంలో ఇరు ప్రభుత్వాలు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ చర్చలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ పాల్గొన్నారు. ఇదే సమయంలో యూఏఈ అధ్యక్షుడితో కలిసి ప్రధాని మోడీ యూపీఐ రూపే కార్డు సేవలను ప్రారంభించారు. యూఏఈ స్థానిక కార్డు జీవన్​ కార్డ్​తో భారత్​ రూపే కార్డును లింక్​ చేశారు.



Next Story

Most Viewed