BIG BREAKING: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు

by Disha Web Desk 19 |
BIG BREAKING: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజకీయాల్లో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్టు అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1వ తేదీ వరకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. దీంతో కేజ్రీవాల్ తీహార్ జైలు నుండి విడుదల అయ్యి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరు వర్గాల వాదనలు విని గురువారం తీర్పును రిజర్వ్ చేసింది.

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, సీఎంగా ఉన్న కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అతడి తరుఫు లాయర్లు వాదించారు. సీఎం అయినంతా మాత్రాన కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వొద్దని, ఎన్నికల్లో ప్రచారం చేయడమేమి ప్రాథమిక హక్కు కాదని, కేసు విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో అతడికి బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ తరుఫు లాయర్లు వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. కేజ్రీవాల్ తరుఫు లాయర్ల వాదనలతో ఏకీభవించి ఆప్ అధినేతకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed