‘వందేమాతరం’ పంక్తులు తొలగించి.. దేశ విభజనకు బీజాలు వేశారు: మోడీ

by Phanindra |

‘వందేమాతరం’ గేయంలో పంక్తులు తొలగించిన కాంగ్రెస్.. దేశ విభజనకు బీజాలు వేసిందని ప్రధాని మోడీ విమర్శించారు.

‘వందేమాతరం’ పంక్తులు తొలగించి.. దేశ విభజనకు బీజాలు వేశారు: మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటీష్ అరాచక పాలన సమయంలో దేశాన్ని ఒక్కటి చేసిన ‘వందేమాతరం’ గేయం పుట్టి 150 ఏళ్లు గడిచిన సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరిగాయి. ఈ క్రమంలోనే న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక స్టాంపు, తపాలా బిళ్లను ఆయన విడుదల చేశారు. స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినివ్వడంతోపాటు ఇప్పటికీ దేశ ఐకమత్యం, గౌరవాన్ని ప్రతిబింబించే ఈ గేయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చే ఏడాది నవంబరు 7 వరకు వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదొక చారిత్రకమైన రోజని, దేశంలోని కోట్లాది మంది ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపుతుందని ప్రధాని మోడీ అన్నారు. భారతదేశం అనే సిద్ధాంతం, స్వతంత్రంగా జీవించాలనే ఆలోచనే ‘వందేమాతరం’ గేయానికి స్ఫూర్తి అని ఆయన చెప్పారు. భారతీయులను బానిసలుగా చూసే రోజుల్లో.. దేశ స్వాతంత్ర్యానికి ‘వందేమాతరం’ గేయం ఒక గర్జనగా మారిందని వివరించారు. తన బిడ్డలకు స్వేచ్ఛ ఇచ్చేందుకు, వారిని బంధించిన సంకెళ్లను భరతమాత తొలగించిందని మోడీ పేర్కొన్నారు.

అయితే బంకించంద్ర ఛటర్జీ రాసిన ఈ గేయంలో కొన్ని ప్రధాన పంక్తులను నెహ్రూ హయాంలోని కాంగ్రెస్ తొలగించిందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ విమర్శించారు. 1937 ఫైజాబాద్ సెషన్‌లో ఈ అద్భుతమైన గేయాన్ని కాంగ్రెస్ ముక్కలు చేసి, దేశ విభజనకు బీజాలు వేసిందని ఆరోపించారు. ఇలాంటి అన్యాయం చేయాల్సిన అవసరం ఏముందన్న ఆయన.. ఇప్పటికీ దేశానికి అలాంటి విభజించే సిద్ధాంతాలు సవాళ్లుగానే ఉన్నాయన్నారు. ఇప్పటికీ ఈ గేయం దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని చెప్పారు. భరతమాతకు 140 కోట్ల మంది సంతానం, 280 కోట్ల చేతులున్నాయని, వీరిలో 60 శాతం యువతేనని చెప్పిన ఆన.. భారత్‌కు ఏదీ అసాధ్యం కాదని ప్రకటించారు.

బీజేపీ విమర్శలు..

వందేమాతరం గేయం నుంచి కొన్ని భాగాలను తొలగించిన భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ‘చారిత్రక పాపం’ చేశారని బీజేపీ నేత సీఆర్ కేశవన్ విమర్శించారు. జాతీయ గీతంగా ఆలపించేందుకు కూడా వందేమాతరం సరిపోదంటూ సుభాష్ చంద్రబోస్‌కు నెహ్రూ లేఖ రాశారని చెప్పారు. మత విశ్వాసాలను బుజ్జగించేందుకు గీతంలోని దుర్గామాత పంక్తులను కాంగ్రెస్ కావాలనే తొలగించిందని ఆరోపించారు. ఇటీవల ఛఠ్ పూజపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసిన కేశవన్.. కాంగ్రెస్‌లో హిందూ వ్యతిరేక మనస్తత్వం కొనసాగుతూనే ఉందని విమర్శించారు.

Next Story