పరీక్షల లీకేజీలపై ప్రధాని మౌనం వీడాలి: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

by Kema Shiva Kumar |

నీట్ 2026 పేపర్ లీకేజీపై ప్రధాని మోదీ మౌనాన్ని లోక్‌సభా పక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా నిలదీశారు.

పరీక్షల లీకేజీలపై ప్రధాని మౌనం వీడాలి: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘నీట్-యూజీ 2026’ (NEET-UG) పరీక్ష పేపర్ లీక్, పరీక్ష రద్దు ఉదంతంపై లోక్‌సభా పక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదే పదే పరీక్షల లీకేజీలు జరుగుతున్నా ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా #SackPradhan, ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించండి అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రధానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు.

గత నీట్ పరీక్ష అక్రమాలకు, ప్రస్తుత లీకేజీలకు ముడిపెడుతూ కేంద్ర ప్రభుత్వ తీరును రాహుల్ గాంధీ తీవ్రంగా ఎండగట్టారు. ప్రభుత్వ చర్యలు కేవలం కమిటీలకే పరిమితం అవుతున్నాయని ఆరోపిస్తూ.. నీట్ 2024: పేపర్ లీక్ అయింది. పరీక్ష రద్దు కాలేదు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయలేదు. సీబీఐ (CBI) దర్యాప్తునకు ఆదేశించారు. ఓ కమిటీని వేశారు. నీట్ 2026: మళ్లీ పేపర్ లీక్ అయింది. ఈసారి పరీక్షను రద్దు చేశారు. కానీ, మంత్రి మాత్రం ఇప్పటికీ రాజీనామా చేయలేదు. మళ్లీ సీబీఐ దర్యాప్తు చేస్తోంది.. ఇప్పుడు మరో కొత్త కమిటీని వేయనున్నారు అంటూ సెటైర్లు వేశారు.

ప్రధాని మోదీని దేశం ప్రశ్నిస్తోంది..

ఈ లీకేజీల లూప్‌కు అడ్డుకట్ట వేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన మూడు ప్రధాన ప్రశ్నలను లేవనెత్తారు. దేశంలో పరీక్షల పేపర్ లీకేజీలు పదే పదే ఎందుకు జరుగుతున్నాయని అన్నారు. నిర్వహించే ‘పరీక్ష పే చర్చ’ (Pariksha pe Charcha) కార్యక్రమం లాగే.. ఈ ‘పరీక్షల పేపర్ల లీకేజీల చర్చ’పై ప్రతిసారీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఫైర్ అయ్యారు. పరీక్షల నిర్వహణలో వరుసగా వైఫల్యం చెందుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధా‌‌న్‌ను ఎందుకు పదవి నుంచి తొలగించడం లేదని ప్రధాని మోడీని రాహుల్ ప్రశ్నించారు. పరీక్ష కోసం రాత్రింబవళ్లు కష్టపడిన 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, లేదా ప్రధాని మోదీనే ఈ వైఫల్యానికి వ్యక్తిగత బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Next Story