వైఫల్యమే విజయానికి తొలిమెట్టు.. 'మన్ కీ బాత్' 128వ ఎపిసోడ్ లో ప్రధాని మోడీ

by Malleboina Mahesh |   (  Updated:2025-11-30 07:04:54  IST  )

భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి నెల చివరి ఆదివారం 'మన్ కీ బాత్' ఎపిసోడ్ ద్వారా దేశంలోని వివిధ అంశాలపై తన సందేశాన్ని దేశ ప్రజలకు అందజేస్తున్న విషయం తెలిసిందే.

వైఫల్యమే విజయానికి తొలిమెట్టు.. మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్ లో ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి నెల చివరి ఆదివారం 'మన్ కీ బాత్' ఎపిసోడ్ ద్వారా దేశంలోని వివిధ అంశాలపై తన సందేశాన్ని దేశ ప్రజలకు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు 'మన్ కీ బాత్' 128వ ఎపిసోడ్ లో భారత యువతలో నిబిడీకృతమై ఉన్న పట్టుదల, ఆత్మవిశ్వాసం పై ప్రశంసలు కురిపించారు. ఇస్రో నిర్వహించిన డ్రోన్ పోటీ, చంద్రయాన్-2 వైఫల్యం తర్వాత చంద్రయాన్-3 విజయం సాధించిన విధానాన్ని ఆయన ఉదహరించారు. 'వికసిత్ భారత్' సాధనలో యువత సంకల్పమే అతిపెద్ద బలం అని ఈ సందర్భంగా ప్రధాని స్పష్టం చేశారు.

మార్స్ వాతావరణంలో డ్రోన్ సవాల్

"కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఇస్రో నిర్వహించిన ఓ ప్రత్యేక డ్రోన్ పోటీ వీడియో తన దృష్టిని ఆకర్షించిందని, అందులో మన దేశ యువత, ముఖ్యంగా Gen-Z, అంగారక గ్రహం (మార్స్)పై ఉన్న వాతావరణాన్ని పోలిన పరిస్థితుల్లో డ్రోన్‌లను ఎగురవేయడానికి ప్రయత్నించారని ప్రధాని మోదీ వివరించారు. ఈ పోటీలో డ్రోన్‌లు జీపీఎస్ (GPS) సపోర్ట్ లేకుండా తమ ఇన్‌బిల్ట్ సాఫ్ట్‌వేర్, కెమెరాను మాత్రమే ఉపయోగించి ఎగరాలి. జీపీఎస్ లేకపోవడం వల్ల అవి కొన్ని క్షణాలు స్థిరంగా ఉన్నప్పటికీ, తరచూ కిందపడిపోయాయని ప్రధాని తెలిపారు. ఎన్నోసార్లు కూలిపోయినా నిరాశ చెందకుండా ప్రయత్నించిన పుణె బృందం విజేతగా నిలిచిందని గుర్తు చేస్తూ ఈ సందర్భంగా వారి పట్టుదలను ప్రధాని కొనియాడారు.

వైఫల్యమే విజయానికి తొలి అడుగు

వైఫల్యమే విజయానికి తొలి అడుగు.. తనకు చంద్రయాన్ రోజులను గుర్తు చేసిందని ప్రధాని అన్నారు. "చంద్రయాన్-2 నెట్‌వర్క్ కవరేజీ నుంచి బయటికి వెళ్లిన రోజు, దేశం మొత్తం, ముఖ్యంగా శాస్త్రవేత్తలు చాలా నిరాశకు గురయ్యారు. కానీ ఆ వైఫల్యం వారిని వెనక్కి నెట్టలేదు. సరిగ్గా అదే రోజు, వారు చంద్రయాన్-3 విజయగాథను రాయడం ప్రారంభించారు," అని మోడీ గుర్తు చేశారు. డ్రోన్ పోటీలో పుణె యువత చూపిన పట్టుదల, ఇస్రో శాస్త్రవేత్తల నిబద్ధత ఒకటేనని, మన యువతరం యొక్క సంకల్పమే 'వికసిత్ భారత్' యొక్క అతిపెద్ద బలం అని ప్రధాని ఉద్ఘాటించారు. దేశ సాంకేతిక పురోగతికి యువత అకుంఠిత కృషి కీలకమని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

'తమిళం నేర్చుకుందాం' థీమ్‌తో సాంస్కృతిక సమ్మేళనం

భారతదేశంలోని రెండు ప్రాచీన నగరాలైన కాశీ (వారణాసి), తమిళనాడుల మధ్య ఉన్న సాంస్కృతిక బంధాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. "కాశీ-తమిళ సంగమం యొక్క 4వ ఎడిషన్ డిసెంబర్ 2వ తేదీన వారణాసిలోని నమో ఘాట్‌లో ప్రారంభమవుతుందని ప్రధాని ప్రకటించారు. ఈ సంవత్సరం థీమ్ చాలా ఆసక్తికరంగా ఉందని – అదే 'తమిళ్ కర్కలమ్' (తమిళం నేర్చుకుందాం) – అని ప్రధాని వెల్లడించారు. తమిళ భాషను, సంస్కృతిని ప్రేమించేవారందరికీ కాశీ తమిళ సంగమం ఒక ముఖ్యమైన వేదికగా మారిందని మోడీ అన్నారు. "తమిళ సంస్కృతి గొప్పది, తమిళ భాష గొప్పది. తమిళం భారతదేశానికే గర్వకారణం," అంటూ తమిళ భాషా వైభవాన్ని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు.

అంతర్జాతీయ గీతా మహోత్సవం

కురుక్షేత్రంలోని అంతర్జాతీయ గీతా మహోత్సవంలో పాల్గొన్న అనుభవాన్ని మోడీ ప్రజలతో పంచుకున్నారు. బ్రహ్మ సరోవరం వద్ద జరిగిన ఈ మహోత్సవానికి ప్రపంచం నలుమూలల నుంచి, ముఖ్యంగా ఐరోపా, మధ్య ఆసియా దేశాల నుంచి కూడా ప్రజలు వచ్చి భగవద్గీత యొక్క దివ్య గ్రంథం నుండి ప్రేరణ పొందడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో గీత ప్రాధాన్యతను వివరిస్తూ, "ఈ నెల ప్రారంభంలో, మొట్టమొదటిసారిగా సౌదీ అరేబియాలో గీతను ప్రజల వేదికపై ప్రదర్శించారు. ఐరోపాలోని లాత్వియాలో కూడా మరొక స్మరణీయ గీతా మహోత్సవాన్ని నిర్వహించారు," అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తద్వారా భగవద్గీత సందేశం ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

Next Story