- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు కమల వికాసం: విజయోత్సవంలో ప్రధాని మోడీ భావోద్వేగ ప్రసంగం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) సాధించిన ప్రభంజనం దేశ రాజధానిలో పండుగ వాతావరణాన్ని తెచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) సాధించిన ప్రభంజనం దేశ రాజధానిలో పండుగ వాతావరణాన్ని తెచ్చింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన 'సక్సెస్ సెలబ్రేషన్స్'లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని, బెంగాల్ ప్రజలకు మరియు కార్యకర్తలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ నబిన్ వంటి అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ బెంగాల్ ఫలితాలను ఒక చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. "బెంగాల్ ఓటర్లు కొత్త చరిత్ర సృష్టించారు. గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు కమలం వికసించింది. ఇది కేవలం బీజేపీ విజయం కాదు, బెంగాల్ ప్రజల ఆకాంక్షల విజయం" అని కొనియాడారు. బెంగాల్‌లో ఇకపై అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
భద్రత - భరోసా..
ప్రజలకు భద్రత, భరోసా కల్పించే నిజమైన రోజు ఇదని, భయం లేని బెంగాల్‌ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎట్టకేలకు బెంగాల్‌లో కూడా 'డబుల్ ఇంజిన్' సర్కార్ ప్రవేశించిందని, ఇది రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందని పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి పార్టీని గెలిపించిన ప్రతి కార్యకర్తకు ప్రధాని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ భారీ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా, పారదర్శకగా నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి (EC) ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. "బెంగాల్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. పశ్చిమ బెంగాల్‌ను మళ్లీ సోనార్ బంగ్లాగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం." అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ముగిసే సమయానికి బీజేపీ శ్రేణులు 'జై హో బెంగాల్' నినాదాలతో కార్యాలయాన్ని హోరెత్తించారు. 15 ఏళ్ల టీఎంసీ పాలనకు చరమగీతం పాడుతూ బీజేపీ తొలిసారిగా బెంగాల్ పీఠాన్ని అధిరోహించబోతుండటం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అస్సాం, పుదుచ్చేరి ప్రజలకు కూడా ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు.






