PM Modi: రాణా అప్పగింత.. పద్నాలుగేళ్ల క్రితం ప్రధాని చేసిన పోస్టు వైరల్

by Shamantha N |

ముంబై ఉగ్రదాడి(Mumbai Terror Attacks) కేసులో కీలక సూత్రధారి తహవూర్ రాణా(Tahawwur Rana) ను భారత్ కు తిరిగి రప్పించారు.

PM Modi: రాణా అప్పగింత.. పద్నాలుగేళ్ల క్రితం ప్రధాని చేసిన పోస్టు వైరల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబై ఉగ్రదాడి(Mumbai Terror Attacks) కేసులో కీలక సూత్రధారి తహవూర్ రాణా(Tahawwur Rana) ను భారత్ కు తిరిగి రప్పించారు. కాగా.. ప్రస్తుతం అతడు ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. రాణాను అధికారులు ప్రశ్నించనున్నారు. అయితే, ప్రస్తుతం పద్నాలుగేళ్ల క్రితం రాణా అప్పగింతకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) సోషల్ మీడియా ఎక్స్ లో చేసిన పోస్టు వైరల్ గా మారింది. అయితే, ముంబై ఉగ్రదాడిలో రాణా ప్రత్యక్ష పాత్ర లేదని 2011లో అమెరికా కోర్టు తీర్పు వెలువరించింది. ఉగ్రసంస్థకు అండగా నిలిచాడన్నఅభియోగాలపై అతడ్ని దోషిగ తేల్చింది. అయితే, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ దౌత్య విధానాలను మోడీ తీవ్రంగా విమర్శించారు. ఈ తీర్పుపై 2011 జూన్‌ 10న ప్రధాని మోదీ ట్విటర్‌ (ప్రస్తుతం ఎక్స్‌) వేదికగా స్పందించారు. ‘‘ముంబై ఉగ్రదాడి కేసులో తహవూర్ రాణాను అమాయకుడని యూఎస్‌ ప్రకటించడం.. భారత సార్వభౌమత్వాన్ని అవమానించడమే. మన దేశ విదేశాంగ విధానానికి ఇది భారీ ఎదురుదెబ్బ’’ అని మోడీ పోస్టు పెట్టారు. అయితే, ఈ పోస్టును నెటిజన్లు షేర్ చేస్తూ.. కేంద్రప్రభుత్వ దౌత్య విధానాలను ప్రశంసిస్తున్నారు. రాణాను భారత్ తీసుకురావడంలో మోడీ భారీ విజయాన్ని సాధించారని కొనియాడుతున్నారు.

రాణా అప్పగింతపై అమెరికా స్పందన..

మరోవైపు, అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ నుంచి రాణాను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రత్యేక విమానంలో గురువారం ఢిల్లీకి తీసుకొచ్చారు. ఆ తర్వాత పటియాల హౌస్‌ కోర్టులో హాజరుపర్చారు. దీనిపై కోర్టు విచారణ జరిపి రాణాను 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించింది. ఇకపోతే, అమెరికాలో యూఎస్ మార్షల్స్ రాణాను భారత అధికారులకు అప్పగిస్తున్న ఫొటో బయటకొచ్చింది. అమెరికా న్యాయశాఖ ఆ ఫొటోను విడుదల చేసింది. అంతేకాకుండా, రాణా అప్పగింతపై అగ్రరాజ్యం స్పందించింది. ‘‘ఉగ్రదాడుల బాధ్యులకు తగిన శిక్ష పడేలా భారత్‌ చేస్తున్న ప్రతి పనికి ఎంతోకాలంగా అమెరికా మద్దతుగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పెను సమస్యగా మారిన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఈ రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. ఆ నిబద్ధతను పాటిస్తూనే రాణాను భారత్ కు అప్పగించాం’’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టమ్మీ బ్రూస్‌ వెల్లడించారు.

Next Story