Pm modi: స్వదేశీ టెక్నాలజీతోనే సత్తా చాటాం.. ప్రధాని మోడీ

by B.Srinivas |

ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక స్వదేశీ సాంకేతికత, మేక్ ఇండియా వ్యూహాలే ప్రధానంగా ఉన్నాయని ప్రధాని మోడీ అన్నారు.

Pm modi: స్వదేశీ టెక్నాలజీతోనే సత్తా చాటాం.. ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక స్వదేశీ సాంకేతికత, మేక్ ఇండియా వ్యూహాలే ప్రధానంగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) అన్నారు. ఆపరేషన్ సిందూర్ టైంలో భారత సైనికుల సామర్థ్యాలను ప్రపంచం మొత్తం చూసిందని కొనియాడారు. కర్ణాటక పర్యటనలో ఉన్న మోడీ బెంగళూరు మెట్రో ఫేజ్-3 ప్రాజెక్టు, ఫేజ్-2 ప్రాజెక్ట్ ఎల్లో లైన్ మెట్రో, మూడు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. అనంతరం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘భారత్ చేపట్టిన దాడుల తర్వాత ఉగ్రవాదులను రక్షించడానికి వచ్చిన పాకిస్తాన్‌ను గంటల్లోనే మోకరిల్లేలా చేశాం. ఈ ఆపరేషన్ విజయానికి బెంగళూరు, కర్ణాటక గణనీయంగా దోహదపడ్డాయి. స్వదేశీ సాంకేతికత, మేక్ ఇన్ ఇండియాలు తమ సత్తా చాటాయి’ అని అన్నారు. బెంగళూరు నవ భారతదేశానికి చిహ్నంగా మారిందని, దాని ఆత్మలో తత్వ జ్ఞానం, కార్యాచరణలో సాంకేతిక జ్ఞానం ఉందని ప్రశంసించారు. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బెంగళూరు మెట్రో ఒక కొత్త నమూనాను ప్రవేశపెట్టిందని కొనియాడారు.

నేడు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని తెలిపారు. గత 11 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి టాప్ 5కి పెరిగిందని, టాప్ 3 ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ఎంతో వేగంగా ప్రయత్నిస్తున్నామన్నారు. 2014లో మెట్రో కేవలం ఐదు నగరాలకే పరిమితమై ఉండగా, ప్రస్తుతం 24 నగరాలు 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయన్నారు. 2014 వరకు భారత్‌లో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు వాటి సంఖ్య 160కి చేరిందని తెలిపారు. దేశంలో డిజిటల్ ప్రయోజనాలు సమాజంలోని ప్రతి వ్యక్తికి చేరేలా ప్రయత్నిస్తామన్నారు.

ఎల్లో లైన్ మెట్రో నిధుల్లో కేంద్రం వాటా 20 శాతమే: డీకే శివకుమార్

బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టులో కేంద్రం వాటా చాలా తక్కువగా ఉందని, ప్రాజెక్టు వ్యయంలో 80 నుంచి 90 శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (Dk shiva kumar) అన్నారు. కొన్ని చోట్ల, కేంద్రం కేవలం 11 శాతం మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. కేంద్రం కర్ణాటకను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కానీ ప్రధాని మోడీని గౌరవించాలనే ఉద్దేశంతో మెట్రో ఎల్లో లైన్‌ను ప్రారంభించాలని ఆహ్వానించినట్టు చెప్పారు. భూసేకరణ, మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చిందన్నారు.

Next Story