బెంగాల్, అస్సాం టూర్.. వందే భారత్ స్లీపర్ ప్రారంభించనున్న ప్రధాని!

by Phanindra |

బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో పీఎం మోడీ పర్యటించనున్నారు. అక్కడ వేల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు.

బెంగాల్, అస్సాం టూర్.. వందే భారత్ స్లీపర్ ప్రారంభించనున్న ప్రధాని!
X

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ప్రధాని మోడీ మరోసారి పర్యటించనున్నారు. శనివారం నాడు బెంగాల్‌లోని మాల్దాకు వెళ్లి భారత్‌లో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను జెండా ఊపి ప్రారంభిస్తారు. అక్కడే జరగనున్న బహిరంగ సభలో రూ.3,250 కోట్ల విలువైన రైలు, రోడ్డు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారని సమాచారం. ఆ మరుసటి రోజు హుగ్లీలోని సింగూర్ చేరుకొని, అక్కడ రూ.830 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. అలాగే నాలుగు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను వర్చువల్‌గా ప్రారంభిస్తారని అికారులు తెలిపారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఉన్న రాధికాపూర్-ఎస్‌ఎంవీటీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్, బలూర్‌ఘాట్-ఎస్‌ఎంవీటీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా మోడీ లాంచ్ చేయనున్నారు. అలాగే హైవే 31డీలో ధూప్‌గురి-ఫలాకటా సెక్షన్‌లో మరమ్మతులు, నాలుగు లేన్లుగా మార్చే పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇలా పశ్చిమ బెంగాల్‌లో పలు ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు.

అస్సాంలో కూడా..

అలాగే శనివారం నాడు సాయంత్రం 6 గంటలకు అస్సాం రాజధాని గువహతిలో జరిగే బోడో సాంస్కృతిక కార్యక్రమం ‘బగురుంబా ద్వోహో 2026’లో పాల్గొంటారు. ఈ వేడుకలో పది వేల మందికిపైగా బోడో కళాకారులు బగురుంబా నృత్యంతో అలరించనున్నారు. ఆ మరుసటి రోజు రూ.6,950 కోట్ల విలువైన కజిరంగా ఎలివేటర్ కారిడార్ ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తారు. అలాగే గువాహతి-రోహ్‌తక్, దిబ్రూగఢ్-లక్నో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ప్రారంభించనున్నారు.

Next Story