PM Modi: దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 28న హెచ్‌పీవీ టీకా క్యాంపెయిన్ ప్రారంభించనున్న ప్రధాని మోడీ

by S Gopi |

ఫిబ్రవరి 28న ఉదయం 11.30 గంటలకు ఈ క్యాంపెయిన్ మొదలవుతుందని మంత్రిత్వ శాఖ లేఖలో పేర్కొంది.

PM Modi: దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 28న హెచ్‌పీవీ టీకా క్యాంపెయిన్ ప్రారంభించనున్న ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 28న దేశవ్యాప్త హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) టీకా క్యాంపెయిన్‌ను రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ప్రారంభించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు లేఖ పంపింది. ఫిబ్రవరి 28న ఉదయం 11.30 గంటలకు ఈ క్యాంపెయిన్ మొదలవుతుందని మంత్రిత్వ శాఖ లేఖలో పేర్కొంది. మహిళల్లో ప్రాణాంతకంగా మారుతున్న గర్భాశయ (సర్వైకల్) క్యాన్సర్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 14 ఏళ్ల లోపు వయసున్న అమ్మాయిలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకా వేయాలని నిర్ణయించింది. త్వరలో అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ వ్యాక్సిన్ నాలుగు రకాల గర్భాశయ కేన్సర్లను నిరోధిస్తుంది. ప్రధానంగా ఈ క్యాన్సర్‌కు కారణమైన హెచ్‌పీవీ టైప్ 16, 18తో పాటు టైప్ 6, 11 రకాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఒక డోసుతో బాలికలకు దీర్ఘకాలానికి రక్షణ లభిస్తుందని పేర్కొన్నాయి. జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా హెచ్‌పీవీ టీకాను స్వచ్ఛందంగా, ఉచితంగా అందించనున్నారు. గణాంకాల ప్రకారం, ప్రపంచంలో గర్బాశయ (సర్వైకల్) క్యాన్సర్ బాధితులు చైనా, అమెరికా తర్వాత భారత్‌‌లోనే అత్యధికంగా ఉన్నారు. ప్రస్తుతం ఏడాదికి 2 కోట్ల మంది ఈ కేన్సర్ బారిన పడుతుండగా.. ఇందులో మనవాళ్లే 15 లక్షల మంది ఉన్నారు.

Next Story