మారిషస్‌కు వెళ్లనున్న ప్రధాని మోడీ.. కారణం ఏంటంటే?

by Ajay Maddhiboyina |

ప్రధాని మోడీ ఇక్కడ ప్రత్యేక అతిథిగా రావడం వల్ల రెండు దేశాల సన్నిహిత సంబంధాలు మరింతగా మెరుగుపడతాయని నవీన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మారిషస్‌కు వెళ్లనున్న  ప్రధాని మోడీ.. కారణం ఏంటంటే?
X

- 57వ నేషనల్ డే ముఖ్య అతిథిగా మోడీ

- వెల్లడించిన ప్రధాని నవీన్ రామ్ గూలమ్

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ మారిషస్ పర్యటనకు వెళ్లనున్నారు. మారిషస్ 57వ నేషనల్ డే వేడుకల్లో నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు ఆ దేశ ప్రధాని నవీన్ రామ్ గూలమ్ పార్లమెంట్‌లో వెల్లడించారు. ఆ దేశ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన రామ్ గూలమ్ 'మన దేశ 57వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నా ఆహ్వానాన్ని మన్నించి భారత ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కావడానికి ఒప్పుకున్నారు. ఈ విషయం తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. మన ఆహ్వానాన్ని అంగీకరించడం మనకు గౌరవం. అలాంటి విశిష్ట వ్యక్తికి మనం ఆతిథ్యం ఇవ్వడం కూడా ప్రత్యేక గౌరవమే' అని పార్లమెంటులో చెప్పారు.

ప్రధాని మోడీ ఇక్కడ ప్రత్యేక అతిథిగా రావడం వల్ల రెండు దేశాల సన్నిహిత సంబంధాలు మరింతగా మెరుగుపడతాయని నవీన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మారిషస్‌కు 1968 మార్చి 12న బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం లభించింది. నిరుడు నేషనల్ డే సెలబ్రేషన్స్‌కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా, గత నవంబర్‌లో మారిషస్ ప్రధానిగా నవీన్ రామ్ గూలమ్ ఎన్నికైన సందర్భంలో ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ అభినందించారు. చాలా ఏళ్లుగా భారత ప్రభుత్వం మారిషస్‌తో ప్రత్యేకమైన, శాశ్వతమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో బడ్జెట్‌లో మారిషస్‌కు ప్రత్యేక నిధులు కూడా ఇస్తూ వస్తోంది.

Next Story