విశ్వసనీయ నేతల్లో టాప్.. 75 శాతం ప్రజల మద్దతు మోడీకే!

by Phanindra |   (  Updated:2025-07-26 18:00:13  IST  )

ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోడీ నిలిచారు. యూఎస్ కంపెనీ చేసిన సర్వేలో 75 శాతం మంది ప్రజలు మోడీకి మద్దతిచ్చారు.

విశ్వసనీయ నేతల్లో టాప్.. 75 శాతం ప్రజల మద్దతు మోడీకే!
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచాధినేతల్లో అత్యంత విశ్వసనీయత ఉన్న నేతగా భారత ప్రధాని మోడీ నిలిచారు. యూఎస్‌కు చెందిన బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. ‘డెమొక్రటిక్ లీడర్స్ అప్రూవల్ రేటింగ్స్’ పేరిట విడుదల చేసిన ఈ రిపోర్టులో ఏకంగా 75 శాతం మద్దతుతో భారత ప్రధాని నరేంద్ర మోడీ అగ్రస్థానంలో నిలిచారు.

ఆయన తర్వాత సౌత్ కొరియా కొత్త అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ 59 శాతం అప్రూవల్ రేటింగ్‌తో రెండో స్థానంలో ఉన్నారు. ప్రపంచానికి ఏకైక శాంతి దూతను తానే అని చెప్పుకుంటున్న యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కేవలం 45 శాతం మద్దతుతో 8వ ర్యాంకులో ఉన్నట్లు ఈ రిపోర్టు వెల్లడించింది. ఈ సర్వేలో పాల్గొన్న ప్రజల్లో 75 శాతం మంది ప్రధాని మోడీకి మద్దతివ్వగా.. 18 శాతం వ్యతిరేకించారు. మరో 7 శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోయారని మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది.

మోడీ, లీ జే మ్యుంగ్ తర్వాతి స్థానాల్లో వరుసగా జేవియర్ మిల్లీ (అర్జెంటీనా-57%), మార్క్ కార్నీ (కెనడా-56%), ఆంథనీ అల్బనీస్ (ఆస్ట్రేలియా-54%), క్లాడియా షేన్‌బామ్ (మెక్సికో-53%), కరిన్ కెల్లర్ సట్టర్ (స్విట్జర్లాండ్-48%), డొనాల్డ్ ట్రంప్ (యూఎస్ఏ-44%), డొనాల్డ్ టస్క్ (పోలాండ్-41%), జార్జియా మెలనీ (ఇటలీ-40%) ఉన్నారు.

Next Story