- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌కు డీల్ అంటో బోఫోర్స్.. అందుకే విమర్శలు: మోడీ
కాంగ్రెస్‌కు డీల్ అంటో బోఫోర్స్ స్కాం మాత్రమే తెలుసునని, అందుకే తాము చేసుకునే డీల్స్‌ను విమర్శిస్తారని మోడీ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యసభ వేదికగా విపక్షాలపై ప్రధాని మోడీ మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. ఈయూ, యూఎస్‌తో భారత్ చేసుకున్న వాణిజ్య ఒప్పందాలను కొనియాడారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసిందన్న ఆయన.. తమ హయాంలో 18 వేల గ్రామాలకు విద్యుత్ వెలుగులు అందించామని, రక్షణ రంగం కోసం ఖజానా తెరిచి అవసరమైన ఎక్విప్‌మెంట్ అందించామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌ను కూడా కొనియాడారు. ఇలా దేశం కోసం పనిచేసినందుకే విపక్షాలు మోడీని సమాధి చేయాలనుకుంటున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో డీల్ అంటే బోఫోర్స్ ఒకటే గుర్తొచ్చేదని, కానీ తమ ప్రభుత్వం 9 దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని, అలాగే 27 దేశాల ఈయూ కూటమితో అతిపెద్ద ట్రేడ్ డీల్ చేసుకుందని అన్నారు. టీఎంసీని కూడా టార్గెట్ చేసిన ఆయన.. బెంగాల్ ప్రజల భవిష్యత్తును ఆ పార్టీ నాశనం చేస్తోందని మండిపడ్డారు. ‘సంపన్న దేశాలు కూడా చొరబాటు దారులను బయటకు పంపేస్తున్నాయి. కానీ మన దేశంలో చొరబాటుదారుల కోసం కోర్టులకు ఎక్కుతున్నారు. వాళ్లు మన యువత ఉద్యోగాలు, ఆదివాసీల భూములు లాక్కుంటున్నారని తెలియడం లేదా?’ అంటూ టీఎంసీపై విమర్శలు చేశారు.
భారత్‌తో డీల్స్‌పై ప్రపంచం ఆసక్తి..
ప్రపంచంలో కొత్త ఆర్డర్ వస్తోందని, రెండో ప్రపంచ యుద్ధం నాటి వరల్డ్ ఆర్డర్ మారిపోతోందని ప్రధాని మోడీ చెప్పారు. ఈ కొత్త ఆర్డర్ భారత్ వైపు మొగ్గుతోందన్నారు. మన దేశం విశ్వమిత్ర, విశ్వబంధుగా మారుతోందని, ఎన్నో దేశాలకు కీలక భాగస్వామిగా ఎదిగిందని తెలిపారు. ఈయూ, యూఎస్‌తో భారత్ చేసుకున్న డీల్స్‌ను ప్రపంచమంతా కొనియాడుతోందని, ఈ ఒప్పందాలు అంతర్జాతీయంగా కాన్ఫిడెన్స్ తెచ్చాయని మోడీ తెలియజేశారు. ఇలాంటి విషయాలపై డిబేట్ ఉన్నత స్థాయిలో జరగాలంటూ విపక్షాలపై చురకలేశారు. ప్రపంచం నేడు గ్లోబల్ సౌత్ గురించి మాట్లాడుతోందని, భారత్ ఈ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోందని వివరించారు. భారత్‌తో డీల్స్ చేసుకోవడానికి బడా దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఇదే సమయంలో వాకౌట్ చేసిన విపక్ష నేతలను టార్గెట్ చేసిన ఆయన.. ‘కొందరు అలసిపోయి సభ నుంచి వెళ్లిపోయారు. కానీ వాళ్ల పాలనలో ఏ దేశమూ మనతో ఎందుకు డీల్స్ చేసుకోలేదో ఏదో ఒక రోజు వాళ్లు సమాధానం చెప్పాల్సి ఉంటుంది’ అని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ప్రపంచ దేశాల ముందు భారత్ ఇమేజ్ చెడిపోయిందని, దాన్ని తాము సరిచేస్తున్నామని అన్నారు. ఇప్పుడు భారత్‌లో ఉన్న నైపుణ్యాలను ప్రపంచం గుర్తిస్తోందన్నారు. పెద్ద ఆర్థిక వ్యవస్థలో వేగంగా ఎదుగుతోంది మనమేనన్న మోడీ.. ద్రవ్యోల్బణం చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు.
బ్యాంకింగ్ వ్యవస్థను చక్కదిద్దాం..
దేశంలో గుట్టలు గుట్టలుగా ఎన్‌పీఏలు (నాన్ పెర్ఫామింగ్ అసెట్స్) ఉండేవని, వాటన్నింటినీ తాము సవాల్‌గా తీసుకొని చక్కదిద్దుతున్నామని మోడీ చెప్పారు. అందరితో కలిసి చర్చలు జరిపి,సంస్కరణలు చేసి, పారదర్శకంగా వీటిని తగ్గిస్తూ వచ్చామన్నారు. సరిగా పనిచేయని బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేశామని, దీంతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టినట్లయిందని వివరించారు. బ్యాంకులు బాగుపడటంతో లావాదేవీలు పెరిగాయని, అప్పటి వరకు బ్యాంకులు అందుబాటులో లేని పేదలకు కూడా బ్యాంకింగ్ సేవలు దగ్గరయ్యాయని చెప్పారు. అదే సమయంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ముద్ర యోజన, పీఎం స్వనిధి వంటి పథకాలతో రైతులు, చిన్న వ్యాపారులకు అండగా నిలిచామన్నారు. కాంగ్రెస్ అభివృద్ధిని అడ్డుకొని, ఆలస్యం చేస్తుందన్న ఆయన.. నర్మదా డ్యాం ప్రాజెక్టును ప్రస్తావించారు. తను పుట్టడానికి ముందు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఈ డ్యాంను ప్రతిపాదించారని, ఆయన మరణానంతరం మాజీ పీఎం నెహ్రూ దీనికి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ఆ తర్వాత దశాబ్దాల పాటు ఈ ప్రాజెక్టు ముందుకుసాగలేదని, తాను ప్రధాని అయ్యాక డ్యాంను ప్రారంభించామని తెలిపారు. కాంగ్రెస్ అభివృద్ధి మోడలే ఇదని విమర్శించారు. ‘స్వతంత్రం వచ్చినప్పుడు ప్రపంచంలో భారత్ ఆరో ఆర్థిక వ్యవస్థగా ఉండేది. దాన్ని వీళ్లు 11వ స్థానానికి తీసుకెళ్లారు. ఇప్పుడు మనం మూడో స్థానానికి చేరుకోబోతున్నాం. అన్ని రంగాల్లో భారత్ కాన్ఫిడెంట్‌గా ఉంది’ అని పీఎం పేర్కొన్నారు.
కాంగ్రెస్‌కు వారంటే ద్వేషం..
రాజ్యసభ చైర్‌లో అస్సాం మహిళ, దళిత మహిళ ఉన్నప్పుడు విపక్ష నేతలు హద్దుమీరి వ్యవహరించారని, ఇది వారిని అవమానించడమేనని పీఎం మోడీ మండిపడ్డారు. అదే సమయంలో బీజేపీ నేత రవ్‌నీత్ సింగు బిట్టును రాహుల్ గాంధీ ‘ద్రోహి’ అనడాన్ని కూడా తప్పుబట్టిన ప్రధాని.. ఎంతోమంది పార్టీలు మారుతుంటారని, కానీ వారెవర్నీ ఇలా ద్రోహి అనలేదని, సిక్కు కాబట్టే బిట్టూను రాహుల్ ‘ద్రోహి’ అన్నారని మోడీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవర్నీ ఇలా ద్రోహి అనడం ఆమోదయోగ్యం కాదని, దేశం కోసం పోరాడిన కుటుంబానికి చెందిన సిక్కుని ఇలా అనడం ఘోరమని విమర్శించారు.
మోడీని రావొద్దని చెప్పా: ఓం బిర్లా
ప్రధాని మోడీ ప్రసంగం లేకుండానే లోక్‌సభ వాయిదా పడింది. దీని గురించి స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. తానే ప్రధానిని సభకు రావొద్దని చెప్పానన్నారు. ‘కొందరు ఎంపీలు సభలో ప్రవర్తించిన తీరు ఘోరం. ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. స్పీకర్ చాంబర్‌లో విపక్ష నేతల ప్రవర్తన పార్లమెంటుకే మచ్చ. ప్రధాని ప్రసంగం కోసం లేచినప్పుడు కొందరు విపక్ష ఎంపీలు ఆయన సీటు వైపు దూసుకెళ్తారని, కొందరు కాంగ్రెస్ నేతలు ఏదో చేయబోతున్నారని నాకు పక్కా సమాచారం అందింది. అందుకే ఆయన్ను సభకు రావొద్దని రిక్వెస్ట్ చేశారు. లీడర్ ఆఫ్ ది హౌస్‌కు మాట్లాడే అవకాశం రాకపోవడం చాలా బాధాకరం. కానీ నా రిక్వెస్ట్‌ను అంగీకరించి ఆయన రాకపోవడం మంచిదైంది. కొందరు మహిళా నేతలు ట్రెజరీ బెంచ్‌ల వైపు ఎలా దూసుకొచ్చారో దేశం అంతా చూసింది. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడండి. కానీ ఇలాంటి ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని బిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం సభను వాయిదా వేశారు.






