‘ఆపరేషన్ సిందూర్’ కేవలం సైనిక చర్య కాదు.. మారుతున్న భారత్‌కు ప్రతీక: మోడీ

by Phanindra |

‘ఆపరేషన్ సిందూర్’ కేవలం సైనిక చర్య కాదని, మారుతున్న భారత్‌కు ప్రతీక అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

‘ఆపరేషన్ సిందూర్’ కేవలం సైనిక చర్య కాదు.. మారుతున్న భారత్‌కు ప్రతీక: మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాదంపై భారత దళాలు చేసిన ‘ఆపరేషన్ సిందూర్’పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆదివారం నాడు తన ‘మన్ కీ బాత్’ రేడియో ప్రోగ్రాంలో భారత దాడుల్లో ధ్వంసమైన ఉగ్రస్థావరాల ఫొటోలను ఆయన పంచుకున్నారు. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రస్థావరాలను భారత దళాలు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘ఆపరేషన్ సిందూర్’ కేవలం ఒక మిలటరీ చర్య కాదని, మారుతున్న భారత్‌కు ప్రతీక అని మోడీ కొనియాడారు. దీంతో ప్రపంచానికి భారత్ పట్టుదల, ధైర్యం, పెరుగుతున్న బలం తెలిసొచ్చాయని ఆయన అన్నారు.

‘మన దళాలు ఆపరేషన్ సిందూర్‌లో చూపించిన తెగువ, ధైర్యసాహసాలు ప్రతి ఒక్క పౌరుడు గర్వపడేలా చేశాయి. కేవలం ఉగ్రస్థావరాలనే ధ్వంసం చేయడంలో వారు చూపిన కచ్చితత్వం అద్భుతం’ అని మోడీ చెప్పారు. ఉగ్రవాదంపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పోరాటానికి ‘ఆపరేషన్ సిందూర్’ మరింత ప్రోత్సాహం, ధైర్యం అందించిందని అన్నారు. అలాగే ఈ మిషన్ విజయవంతం కావడంలో భారత డిఫెన్స్ వ్యవస్థలు కూడా కీలకమైన పాత్ర పోషించాయని తెలిపారు. ‘మనదేశంలో తయారు చేసిన ఆయుధాలు, టెక్నాలజీ ఉపయోగించి అసామాన్యమైన ధైర్యంతో ఉగ్రస్థావరాలను మన దళాలు నాశనం చేశాయి. ఈ విజయంలో ఇంజనీర్లు, టెక్నీషియన్లతోపాటు అందరి శ్రమ ఉంది. ఈ పోరాటంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ ఆశయం స్పష్టంగా కనిపించింది’ అని మోడీ చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘తిరంగా యాత్ర’లను కూడా ఆయన మెచ్చుకున్నారు. నగరాలు, గ్రామాలు, చిన్న పట్టణాల్లో కూడా ప్రజలు సమూహంగా వచ్చి తిరంగా యాత్రల్లో పాల్గొంటున్నారని, దేశ భద్రతా దళాలకు మద్దతుగా నిలుస్తున్నారని కొనియాడారు.

నక్సల్-విముక్త భారతే లక్ష్యం..

దేశంలో నక్సలిజం నిర్మూలనలో విజయం సాధించామని మోడీ పేర్కొన్నారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్-అబుజ్‌మఢ్ ప్రాంతంలో జరిపిన ఆపరేషన్‌ భద్రతా దళాల అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. 2026 నాటికి నక్సల్-ముక్త భారతదేశం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. నక్సల్-ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా చర్యలతో పాటు అభివృద్ధి, పునరావాస కార్యక్రమాల ద్వారా సమగ్ర విధానాన్ని అనుసరిస్తున్నట్లు వివరించారు.

Next Story