సోమనాథ్‌పై దాడులు కేవలం దోపిడీలు కావు.. త్యాగాలు దాచారు: పీఎం మోడీ

by Phanindra |

సోమనాథ్‌పై దాడులు కేవలం దోపిడీలు కావని, స్వాతంత్ర్యం తర్వాత కూడా అప్పటి వీరుల త్యాగాలు దాచారని పీఎం మోడీ ఆరోపించారు.

సోమనాథ్‌పై దాడులు కేవలం దోపిడీలు కావు.. త్యాగాలు దాచారు: పీఎం మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించే శక్తులు ఇప్పటికీ ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గతంలో కత్తులతో ఆలయంపై దాడులు చేస్తే.. ఇప్పుడు వేరే విధంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వందల ఏళ్లుగా ఈ ఆలయంపై జరుగుతున్న దాడులను కేవలం ఆర్థిక దోపిడీగా పరిగణించలేమని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ ఆలయంపై మహమ్మద్ గజినీ 1026లో తొలిసారి దాడి చేశాడు. అప్పటి నుంచి గత వెయ్యేళ్లలో ఎన్నో దాడులను ఈ ఆలయం తట్టుకొని నిలబడింది. ఈ వెయ్యేళ్ల ప్రతిఘటనను గుర్తిస్తూ నిర్వహిస్తున్న ‘స్వాభిమాన్ పర్వ’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘సోమనాథ్ ఆలయంపై జరిగిన దాడులు కేవలం సంపద కోసమే ఆయితే.. వెయ్యేళ్ల క్రితం భారీ దోపిడీ జరిగిన తర్వాత దాడులు ఆగిపోవాల్సింది. కానీ అలా జరగలేదు. ప్రతిసారీ కొత్త వారు ఈ ఆలయంపై దాడులు చేస్తూనే వచ్చారు. విగ్రహాలు ధ్వంసం చేశారు. ఆలయ రూపాన్నే మార్చే ప్రయత్నాలు చేశారు. మనం మాత్రం కేవలం దోపిడీల కోసమే ఇలా జరిగిందనుకున్నాం’ అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ దాడులను వైట్‌వాష్ చేసి కేవలం దోపిడీలుగా కొట్టి పారేశాయని చెప్పారు. ఇలా చేయడం వల్ల కొత్త తరానికి గత తరాలు చేసిన త్యాగాల విలువ తెలియకుండా పోయిందని మోడీ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇప్పటికీ దేశంలో సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించే శక్తులున్నాయన్న మోడీ.. ఈ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ అనేది దాడి జరిగిన వెయ్యేళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమం కాదని, దాడులను ఎదుర్కొని ఆలయం నిలబడిన తీరును గుర్తిస్తూ చేస్తున్న కార్యక్రమం అని చెప్పారు. అంతకుముందు ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘శౌర్య యాత్ర’లో ప్రధాని మోడీతోపాటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, డిప్యూటీ సీఎం హర్ష్ సంఘావీ, మంత్రులు జీతూ వాఘానీ, ప్రద్యుమన్ వాజా కూడా యాత్రలో పాల్గొన్నారు.

Next Story