డ్రగ్స్-ఉగ్రవాదంపై పోరాడాలి.. జీ20 సదస్సులో ప్రధాని మోడీ కీలక ప్రతిపాదనలు!

by Phanindra |

డ్రగ్స్-ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు కలిసి పోరాటం చేయాలని ప్రధాని మోడీ అన్నారు. జీ20 సదస్సులో కీలక ప్రతిపాదనలు చేశారు.

డ్రగ్స్-ఉగ్రవాదంపై పోరాడాలి.. జీ20 సదస్సులో ప్రధాని మోడీ కీలక ప్రతిపాదనలు!
X

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయంగా ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్స్ వ్యాప్తి పెరగడంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తంచేశారు. సౌతాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో నిర్వహించిన జీ20 సమావేశం తొలిరోజు ఓపెనింగ్ ప్రసంగంలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. ఫెంటనిల్ వంటి డ్రగ్స్ వేగంగా వ్యాప్తి చెందుతున్నాయన్న ఆయన.. ఇవి ప్రజారోగ్యం, సమాజ స్థిరత్వం, భద్రతా వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయన్నారు. ఈ క్రమంలోనే డ్రగ్-టెర్రర్ భూతంపై పోరాడేందుకు జీ20 ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రగ్స్ అక్రమ రవాణా చేసే వ్యవస్థలను నాశనం చేయడం, అక్రమ ఆర్థిక లావాదేవీలను అరికట్టడం, ఉగ్ర సంస్థలకు నిధులు దక్కకుండా చేయడం వంటి పనులు చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ చెప్పారు.

అదే సమయంలో కాలం మారుతున్నా కొనసాగుతున్న జీవన విధానాలను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనికోసం జీ20 సహకారంతో ‘గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ’ని ఏర్పాటు చేయాలని సూచించారు. భారత్‌లో ఇప్పటికే ఉన్న ‘ఇండియన్ నాలెడ్జ్ సిస్టం’ ఆధారంగా దీన్ని రూపొందించాలని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో సంప్రదాయాల్లోని విజ్ఞానాన్ని కాపాడేందుకు ఇది అవసరమన్నారు. వాతావరణంలో మార్పుల వేళ వేగంగా జీవన విధానాలు మారిపోతున్న సమయంలో.. సంప్రదాయ విజ్ఞానాన్ని భావితరాలకు అందించడం చాలా ముఖ్యమని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

అంతర్జాతీయ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీం

ఇదే ప్రసంగంలో జీ20 గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీం ప్రతిపాదన చేశారు మోడీ. హెల్త్ ఎమర్జెన్సీలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వెంటనే వైద్యసహకారం అందించేలా సభ్య దేశాలకు చెందిన వైద్య నిపుణులతో ఈ టీంను ఏర్పాటు చేయాలన్నారు. ఇలాంటి విపత్తులు ఎదుర్కొనేందుకు అందరూ ప్రిపేర్ అయితేనే.. కిందిస్థాయిలో వేగంగా చర్యలు తీసుకోగలుగుతామన్నారు. అలాగే ప్రపంచం ముందుకెళ్లాలంటే ఆఫ్రికా ఎదుగుదల కూడా చాలా ముఖ్యమని మోడీ వివరించారు.

అందుకే ఇక్కడి యువతలో నైపుణ్యాలు పెంచేందుకు ‘జీ20 ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్’ పథకాన్ని ప్రతిపాదించారు. జీ20 భాగస్వాముల సహకారంతో ఆఫ్రికాలో పది లక్షల మంది యువతను సర్టిఫైడ్ ట్రైనర్లుగా మార్చడమే ఈ పథకం లక్ష్యమని చెప్పారు. వీరు మరింతమందికి నైపుణ్యాలు నేర్పుతారని, తద్వారా ఆఫ్రికాలో నైపుణ్యమున్న యువత పెరుగుతారని తెలిపారు. ఆఫ్రికాతో భారత్‌కు ఉన్న అనుబంధంతోనే ఈ ప్రతిపాదన చేసినట్లు చెప్పిన ఆయన.. జీ20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించిన సమయంలోనే ఆఫ్రికా యూనియన్ ఈ కూటమిలో చేరిందన్న విషయాన్ని గుర్తుచేశారు.

Next Story