- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండోనేషియాలో మారుమోగిన శివనామం.. చారిత్రక ప్రంబనన్ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
ఇండోనేషియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం చారిత్రక ప్రంబనన్ దేవాలయాన్ని సందర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండోనేషియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం చారిత్రక (Prambanan Temple) ప్రంబనన్ దేవాలయాన్ని సందర్శించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి దాదాపు 1,000 ఏళ్ల నాటి ఈ పురాతన హిందూ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ‘ఓం నమః శివాయ’ మంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మికంగా మార్మోగింది.
పరమశివుడితో నాది ప్రత్యేక అనుబంధం: మోడీ
ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. శివ పరమాత్మతో తనకు ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘నా జన్మస్థలం వడ్ నగర్ లోని హాటకేశ్వర్ మహాదేవ్ మొదలుకొని, మొదటి జ్యోతిర్లింగమైన గుజరాత్ లోని సోమనాథ్, నా నియోజకవర్గం కాశీలోని విశ్వనాథుడు, కేదార్‌నాథ్, ఉజ్జయిని మహాకాల్.. ఇలా శివుడితో నా అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఇండోనేషియాలోని ఈ చారిత్రక ఆలయ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం నా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను’ అని ప్రధాని పేర్కొన్నారు. హెలికాప్టర్ ద్వారా ఆలయానికి చేరుకున్న మోడీ, ఆకాశం నుంచి తీసిన ఆలయ అద్భుత దృశ్యాలను సోషల్ మీడియా (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.
ఆలయ పునరుద్ధరణకు ఇరు దేశాల ఒప్పందం
భారత్-ఇండోనేషియా మధ్య ఉన్న శతాబ్దాల నాటి సాంస్కృతిక బంధానికి ఈ ఆలయం ఒక సజీవ సాక్ష్యం. భారతదేశ ‘యాక్ట్ ఈస్ట్’ విధానంలో భాగంగా, ఈ ఆలయ సముదాయం సంరక్షణ, పునరుద్ధరణ కోసం ఉమ్మడి ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. మంగళవారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో మోడీ, ప్రబోవోలు ఇందుకు సంబంధించిన ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై సంతకాలు చేశారు.
ప్రంబనన్ ఆలయ విశిష్టతలు..
కంబోడియాలోని అంగ్‌కోర్ వాట్ తర్వాత ఆగ్నేయాసియాలోనే రెండవ అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం ఈ ప్రంబనన్. ఇది ఇండోనేషియాలోని జావా దీవిలో ఉంది. 9వ శతాబ్దంలో మాతారం రాజుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం త్రిమూర్తులకు (శివ, విష్ణు, బ్రహ్మ) అంకితం చేయబడింది. ఇందులో 47 మీటర్ల ఎత్తైన శివాలయం ప్రధానమైనది. ఆలయ గోడలపై చెక్కిన రామాయణ, ఇతర హిందూ ఇతిహాసాల శిల్పాలు ప్రాచీన కాలం నాటి భారత-ఆగ్నేయాసియా దేశాల మధ్య ఉన్న నావికా, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను కళ్లకు కడతాయి. ప్రకృతి విపత్తుల వల్ల కాలగర్భంలో కలిసిపోయిన ఈ ఆలయాన్ని 20వ శతాబ్దంలో పునరుద్ధరించారు. 1991లో దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. తాజాగా భారత్ సహకారంతో చేపట్టనున్న పునరుద్ధరణ పనులు.. ఆసియాలోని అత్యంత ముఖ్యమైన ఈ హిందూ కట్టడాన్ని సంరక్షించడంతో పాటు, న్యూఢిల్లీ-జకార్తాల మధ్య నాగరికతా బంధాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి.






