Pm modi: మూడు దేశాల్లో మోడీ పర్యటన.. జీ7 సదస్సుకు హాజరుకానున్న ప్రధాని

by B.Srinivas |   (  Updated:2025-06-14 12:11:47  IST  )

ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నుంచి మూడు దేశాల్లో పర్యటించనున్నారు.15 నుంచి 19 వరకు ఆయన టూర్ కొనసాగనుంది.

Pm modi: మూడు దేశాల్లో మోడీ పర్యటన.. జీ7 సదస్సుకు హాజరుకానున్న ప్రధాని
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నుంచి మూడు దేశాల్లో పర్యటించనున్నారు.15 నుంచి 19 వరకు ఆయన టూర్ కొనసాగనుండగా కెనడా (Canada), క్రొయేషియా (Croatia), సైప్రస్ (Cyprus) దేశాలను సందర్శించనున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) అనంతరం మోడీ తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. మోడీ జూన్ 15 ,16 తేదీల్లో సైప్రస్‌లో తన పర్యటనను ప్రారంభిస్తారు. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్‌తో భేటీ అవుతారు. ఆ తర్వాత లిమాసోల్‌లో పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. రెండు దశాబ్దాల అనంతరం భారత ప్రధాని సైప్రస్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటన మధ్యధరా ప్రాంతం, యూరోపియన్ యూనియన్‌తో భారత వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

క్రొయేషియాకు తొలిసారి భారత ప్రధాని

సైప్రస్ పర్యటన అనంతరం మోడీ 16,17 తేదీల్లో కెనడాలో పర్యటిస్తారు. ఆ దేశంలో జరిగే జీ7 సదస్సుకు హాజరవుతారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా మోడీ G-7 నాయకులు, ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, సాంకేతికత, ఆవిష్కరణ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్వాంటం సంబంధిత అంశాలతో సహా ప్రపంచ సమస్యలపై చర్చించనున్నారు. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనడా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. కెనడా పర్యటన తర్వాత ప్రధాని మోడీ జూన్ 18న క్రొయేషియాలో పర్యటిస్తారు. క్రొయేషియా ప్రధాన మంత్రి ఆండ్రేజ్ ప్లెన్కోవిక్ తో సమావేశమై వివిధ అంశాలపై చర్చిస్తారు. భారత ప్రధాని క్రొయేషియాలో పర్యటించడం ఇదే తొలిసారి.

Next Story