GST: మోడీ నోట 'నియో మిడిల్ క్లాస్' ప్రస్తావన.. ఎవరీ నియో మిడిల్ క్లాస్?

by Prasad Jukanti |   (  Updated:2025-09-21 13:12:09  IST  )

దేశంలో 25 కోట్ల మంది నియో మిడిల్ క్లాస్ ప్రజలు ఉన్నారని మోడీ చెప్పారు.

GST: మోడీ నోట నియో మిడిల్ క్లాస్ ప్రస్తావన.. ఎవరీ నియో మిడిల్ క్లాస్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: జీఎస్టీ 2.0 సంస్కరణలు అమల్లోకి రానున్న నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ (PM Modi Modi Speech) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి దేశంలో కొత్త చరిత్ర మొదలు కాబోతున్నదని, ఈ సంస్కరణలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగకరంగా ఉండబోతున్నాయని మోడీ చెప్పారు. ఈ క్రమంలో తన ప్రసంగంలో ‘నియో మిడిల్ క్లాస్’ (Neo Middle Class) అంశాన్ని మోడీ ప్రస్తావించడంతో నియో మిడిల్ క్లాస్ ఏమిటి అనే చర్చ తెరపైకి వస్తోంది.

దేశంలో కొత్తగా నియో మిడిల్ క్లాస్:

దేశంలో నియో మిడిల్ క్లాస్ పేరుతో కొత్త మధ్యతరగతి వర్గం పెరుగుతోందని వీరికి చాలా ఆకాంక్షలు ఉన్నాయని మోడీ తన తాజా స్పీచ్ లో చెప్పారు. తాము తీసుకువచ్చిన సంస్కరణలు ఈ నియో మిడిల్ క్లాస్ వర్గానికి మంచి ప్రోత్సాహకరం అని చెప్పారు. దీంతో నియో మిడిల్ క్లాస్ ఆసక్తికరంగా మారింది. ఎవరైతే పేదరికాన్ని అధిగమించి సంప్రదాయ మిడిల్ క్లాస్ వర్గానికి పూర్తిగా చేరుకోలేకపోయారో వారిని నియో మిడిల్ క్లాస్ గా పిలుస్తున్నారు. అంటే వీరు కేవలం పేదరికం నుంచి మాత్రమే బయటపడగలిగారని అర్థం. వీరు దిగువ, మధ్య స్థాయిల మధ్య ఆదాయాలు కలిగి ఉన్నప్పటికీ ఏదైనా ఒక ఉత్పత్తి లేదా సేవపై అదనపు ఖర్చు సమర్థనీయమేనా అని నిర్ణయించుకోవడానికి సంకోచిస్తుంటారు. ఈ వర్గాన్ని నియో మిడిల్ క్లాస్ గా అభివర్ణిస్తున్నారు.

11 ఏళ్లలో 25 కోట్ల మంది:

తన స్పీచ్ లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. గత పదకొండు సంవత్సరాలలో దేశంలో 25 కోట్ల మంది పేదరికాన్ని ఓడించారని వీరంతా ఇప్పుడు నియో మిడిల్ క్లాస్ గా అవతరించారని చెప్పుకొచ్చారు. ఈ 25 కోట్ల మంది ప్రజలు నేడు దేశంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం ద్వారా ఈ వర్గానికి పెద్ద ఎత్తున లాభం చేకూరిందని చెప్పారు. దేశంలో పూర్, మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ అనే ఆదాయ వర్గాల ప్రజలు ఉండగా ఇప్పుడు నియో మిడిల్ క్లాస్ వర్గం చర్చనీయాశంగా మారింది. ఈ వర్గం దేశంలో కీలకంగా మారుతున్నారని ప్రభుత్వం సైతం గుర్తించడం, ఆ వర్గాల ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ఊతం ఇచ్చేలా జీఎస్టీ సంస్కరణలు ఉన్నాయని మోడీ చెప్పడం ఆసక్తిగా మారింది.

Next Story