Pm modi: భారతీయ ఐక్యతకు మహాకుంభ్ నిదర్శనం.. ప్రధాని మోడీ

by B.Srinivas |

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ నగరంలో జరిగిన మహాకుంభమేళా ముగిసిన విషయం తెలిసిందే.

Pm modi: భారతీయ ఐక్యతకు మహాకుంభ్ నిదర్శనం.. ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ (Prayag raj) నగరంలో జరిగిన మహాకుంభమేళా (Mahakumba mela) ముగిసిన విషయం తెలిసిందే. 45 రోజుల పాటు కొనసాగిన ఈ జాతరకు 66 కోట్ల మందికి పైగా హాజరై త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు. అయితే కుంభమేళా ముగిసిన అనంతరం ప్రధాని మోడీ (modi) దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సవాల్‌తో కూడుకున్నదని, ఏర్పాట్లలో లోపాలుంటే క్షమించాలని కోరారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘గత 45 రోజులుగా ప్రతిరోజూ దేశంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది త్రివేణి సంగమం వద్దకు తరలిరావడం చూస్తున్నాను. సంగంలో స్నానం చేయాలనే భావోద్వేగాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ప్రతి భక్తుడిలోనూ ఉత్సాహాన్ని, శక్తిని, విశ్వాసాన్ని నింపుతోంది. ఈ మహాయజ్ఞం దేశ ఐక్యతకు నిదర్శనం’ అని పేర్కొన్నారు.

‘ఒకే నది ఒడ్డున, త్రివేణి సంగమం వద్ద కోట్లాది మంది ప్రజలు ఎలా గుమిగూడారో చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది. ఈ కోట్లాది మందికి అధికారిక ఆహ్వానం లేదు. అంతేగాక వారు ఏ సమయంలో చేరుకోవాలో ముందస్తు సమాచారం కూడా లేదు. అయినప్పటికీ ప్రజలు మహా కుంభమేళా వైపు వెళ్లి పవిత్ర సంగమంలో స్నానం చేసి ఆశీర్వదించారు. స్నానం చేసిన తర్వాత ప్రజల ముఖాల్లో కనిపించిన ఉత్సాహాన్ని మర్చిపోలేను. మహిళలు, వృద్ధులు లేదా వికలాంగులు అయినా, ప్రతి ఒక్కరూ సంగం చేరుకోవడానికి తమ వంతు కృషి చేశారు’ అని పేర్కొన్నారు. యువతరం కూడా పెద్ద సంఖ్యలో ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలించిన సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు అభినందనలు తెలిపారు.

Next Story