అస్సాంలో రూ. 10,600 కోట్లతో ఎరువుల ప్లాంట్‌కు ప్రధాని మోడీ భూమిపూజ

by Malleboina Mahesh |

భారత ప్రధాని నరేంద్ర మోడీ అసోం పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

అస్సాంలో రూ. 10,600 కోట్లతో ఎరువుల ప్లాంట్‌కు ప్రధాని మోడీ భూమిపూజ
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ అసోం పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం డిబ్రూగఢ్ జిల్లాలోని నమ్రూప్‌లో సుమారు రూ. 10,600 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 'అసోం వ్యాలీ ఫెర్టిలైజర్ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్' (AVFCCL) అమ్మోనియా-యూరియా ప్రాజెక్టుకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు అసోం, ఈశాన్య రాష్ట్రాల పారిశ్రామిక పురోగతిలో ఒక మైలురాయి అని, దశాబ్దాలుగా నమ్రూప్ ప్రజలు కంటున్న కల నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అంతకుముందు గువాహటిలో కొత్త ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేస్తూ, అసోం అభివృద్ధిలో కొత్త వేగాన్ని పుంజుకుందని ఆయన అన్నారు.

రైతు సంక్షేమంపై తన నిబద్ధతను చాటుతూ, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నమ్రూప్‌లోని పాత ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, అయితే తమ ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించి సరికొత్త టెక్నాలజీతో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తోందని ప్రధాని చెప్పుకొచ్చారు. 2014లో దేశవ్యాప్తంగా యూరియా ఉత్పత్తి 225 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండగా, గత 11 ఏళ్ల కృషి ఫలితంగా అది నేడు 306 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందని ఆయన గణాంకాలను వివరించారు. ఏటా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ కొత్త ప్లాంట్ వల్ల విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, స్థానికంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ప్రధాని మోడీ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

Next Story