అర్జెంటీనా అధ్యక్షుడితో ప్రధాని మోడీ డిలిగేషన్ స్థాయి చర్చలు

by Phanindra |

అర్జెంటీనా అధ్యక్షుడితో ప్రధాని మోడీ డిలిగేషన్ స్థాయి చర్చలు జరిపారు. ఆ దేశంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది.

అర్జెంటీనా అధ్యక్షుడితో ప్రధాని మోడీ డిలిగేషన్ స్థాయి చర్చలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐదు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. శనివారం నాడు అర్జెంటీనా చేరుకున్నారు. ఆయనకు ఆ దేశాధ్యక్షుడు జావియర్ మిలీ ఘనస్వాగతం పలికారు. బ్యూనస్ ఎయిర్స్‌లోని శాన్ మార్టిన్ స్మారకం వద్ద నివాళులర్పించిన ప్రధాని మోడీకి అర్జెంటీనా ప్రెసిడెంట్ భవనం కాసా రొసాడాలో కూడా అద్భుతమైన స్వాగతం లభించింది. అనంతరం డిలిగేషన్ స్థాయి చర్చల్లో మోడీ, జావియర్ మిలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జెంటీనా అధ్యక్షుడితో అద్భుతమైన సమావేశం జరిగిందని, ఆయనతో రక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, భద్రత వంటి ఎన్నో అంశాల్లో సహకారం గురించి చర్చించానని ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

వాణిజ్యం, ఇతర అంశాల్లో ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసేందుకు ఇరుదేశాలు అంగీకరించాయని విదేశాంగ శాఖ సెక్రటరీ పెరియసామి కుమరన్ తెలిపారు. భారత్, మెర్కాసర్ కూటమి మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాన్ని మరింత విస్తృతం చేయాలని మోడీ కోరినట్లు కుమరన్ చెప్పారు. ‘ముఖ్యంగా రక్షణ రంగంలో సహకారాన్ని మరింత పెంచుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. వ్యవసాయంపై కూడా ఫోకస్ పెట్టిన ఇరువురు నేతలు ఈ రంగంలో జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని తమతమ బృందాలను నిర్దేశించారు. అలాగే భారతీయ మెడిసిన్స్‌కు అర్జెంటీనాలో మార్కెట్ యాక్సెస్‌ను సులభతరం చేయాలని మోడీ కోరారు. అదే విధంగా భారత్ నిర్దేశించిుకున్న క్లీన్ ఎనర్జీ గోల్స్‌‌లో అర్జెంటీనా పాత్ర చాలా ముఖ్యమని ప్రధాని చెప్పారు. స్పేస్ రంగంలో కూడా మరింతగా సహకరించుకోవాలని సూచించారు’ అని కుమరన్ వివరించారు. ఇక్కడి నుంచి బ్రిక్స్ సమావేశం కోసం బ్రెజిల్‌కు మోడీ ప్రయాణం అవుతారు.

Next Story