Pm modi: స్వార్థ ప్రయోజనాలకే వక్ఫ్ చట్టాన్ని మార్చిన కాంగ్రెస్.. ప్రధాని మోడీ విమర్శలు

by vinod kumar |
Pm modi: స్వార్థ ప్రయోజనాలకే వక్ఫ్ చట్టాన్ని మార్చిన కాంగ్రెస్.. ప్రధాని మోడీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసమే వక్ఫ్ నిబంధనల్లో మార్పు చేసిందని ఆరోపించారు. అధికారం కోసం రాజ్యాంగాన్ని ఆయుధంలా వాడుకుందని ఫైర్ అయ్యారు. సోమవారం హర్యానా (Haryana) లోని హిస్సార్ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. ముస్లింల హక్కుల కోసం నిరసనలు చేస్తున్న కాంగ్రెస్ తాము అధికారంలో ఉన్నప్పుడు వారికి ఉన్నతస్థాయి బాధ్యతలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తన పార్టీ చీఫ్‌గా ముస్లిం అధ్యక్షుడిని ఎందుకు ఎన్నుకోవట్లేదని, ముస్లిం అభ్యర్థులకు 50 శాతం టిక్కెట్లు ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు.

వక్ఫ్ తో భూ మాఫియాకు మాత్రమే లాభం

‘కాంగ్రెస్ మతవాదులను మాత్రమే సంతృప్తి పరచింది. దీనికి అతిపెద్ద రుజువు వక్ఫ్ చట్టం. లక్షల హెక్టార్ల భూమిని వక్ఫ్ పేరుతో పక్కన పెట్టారు. కానీ దీని వల్ల పేద ముస్లింలు ఎప్పుడూ ప్రయోజనం పొందలేదు. భూ మాఫియా మాత్రమే లాభపడింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంతో ఈ దోపిడీ ఆగిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. సవరించిన వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డు ఏ ఆదివాసీ భూమినీ క్లెయిమ్ చేయలేమన్నారు. ఈ చట్టం సామాజిక న్యాయం పేద ముస్లింలు, పాశ్మాండ ముస్లింలకు హక్కులను కాపాడుతుందన్నారు.

కాంగ్రెస్ వల్లే అంబేడ్కర్ కలలు నాశనం

కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ దార్శనికతకు ద్రోహం చేసిందని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలను రెండో తరగతి పౌరులుగా చూస్తోందని మోడీ ఆరోపించారు. ‘డాక్టర్ అంబేడ్కర్‌ పేదలు, వెనుకబడిన వర్గాలకు గౌరవం కావాలని కలలు కన్నాడు. కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల వైరస్‌ను వ్యాప్తి చేసి ఆయన డ్రీమ్స్‌ను అడ్డుకుంది. అంబేద్కర్ జీవించి ఉన్నప్పుడు కూడా ఆయనను అవమానించారు, ఎన్నికల్లో ఓడిపోయేలా చేశారు. ఆయన వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నించారు’ అని తెలిపారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అధికారం కోసం ఒక సాధనంగా మార్చిందని, రాజ్యాంగ స్ఫూర్తి ఉన్నప్పటికీ యూసీసీ అమలులు వ్యతిరేకించిందని గుర్తు చేశారు. రాజ్యాంగం విలువల గురించి మాట్లాడే కాంగ్రెస్, దాన్ని ఎన్నడూ పాటించలేదన్నారు. కానీ అంబేడ్కర్ పోరాటం తన ప్రభుత్వానికి స్ఫూర్తినిస్తుందని ప్రతి నిర్ణయం, ప్రతి విధానం అంబేద్కర్‌కే అంకితం చేస్తోందన్నారు.



Next Story