‘కలిసి తమిళనాడును అభివృద్ధి చేద్దాం’.. CM విజయ్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-10 06:21:23  IST  )

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన 'తమిళ వెట్రి కళగం' (TVK) అధినేత జోసెఫ్ విజయ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.

‘కలిసి తమిళనాడును అభివృద్ధి చేద్దాం’.. CM విజయ్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన 'తమిళ వెట్రి కళగం' (TVK) అధినేత జోసెఫ్ విజయ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఆదివారం చెన్నైలో జరిగిన అట్టహాసమైన వేడుకలో విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా (X) స్పందిస్తూ.. "తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్‌కి అభినందనలు. ఆయన పదవీ కాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో కలిసి పని చేస్తూనే ఉంటుంది" అని పేర్కొన్నారు.

ప్రమాణ స్వీకారం..

చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్‌తో ప్రమాణం చేయించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 234 స్థానాలకు గాను 108 స్థానాలను గెలుచుకుని సంచలనం సృష్టించింది. మ్యాజిక్ ఫిగర్‌కు స్వల్ప దూరంలో నిలిచినప్పటికీ.. కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. విజయ్‌తో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందులో ఎన్. ఆనంద్, ఆధవ అర్జున్, సెంగొట్టాయన్ వంటి ప్రముఖులు ఉన్నారు. దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను శాసిస్తున్న ద్రవిడ పార్టీల (DMK, AIADMK) ఆధిపత్యానికి గండి కొట్టి విజయ్ ముఖ్యమంత్రి కావడాన్ని రాజకీయ విశ్లేషకులు ఒక చారిత్రక మార్పుగా అభివర్ణిస్తున్నారు. విజయ్ రాజకీయ ఎదుగుదల మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ (MGR)ను గుర్తుకు తెస్తోందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Next Story