- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pm modi: ఏఐ కంటెంట్‌పై క్లియర్ డిక్లరేషన్ తప్పనిసరి.. జీ7 సదస్సులో ప్రధాని మోడీ
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ), డీఫ్‌పేక్‌లపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ), డీఫ్‌పేక్‌లపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో సామర్థ్యాన్ని, ఆవిష్కరణలను పెంపొందించడానికి ఏఐ ఒక శక్తివంతమైన సాధనంగా ఉద్భవించిందని స్పష్టం చేశారు. అయితే ఏఐ రూపొందించిన కంటెంట్‌పై వాటర్‌మార్కింగ్ లేదా క్లియర్ డిక్లరేషన్ ఉండాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూనే దాని ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. అప్పుడే ఏఐని సమర్థవంతంగా ఉపయోగించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతికత వల్ల ప్రజలకు మేలు జరిగినప్పుడే దానికి విలువ ఉంటుందన్నారు.కెనడాలో జరిగిన జీ7 సదస్సులో మోడీ ప్రసంగించారు. ప్రస్తుత యుగం ఏఐదే అయినప్పటికీ, టెక్నాలజీతో కూడిన వ్యవస్థలను సురక్షితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దీనికి ప్రపంచ వ్యాప్తంగా సహకారం అవసరమని నొక్కి చెప్పారు. అలాగే డీప్‌ఫేక్ చాలా ఆందోళన కలిగించే విషయమని దీనిపై స్పష్టమైన పర్యవేక్షణ ఉండాలని తెలిపారు.
ఉగ్రవాద దేశాలు మూల్యం చెల్లించుకోక తప్పదు
ఉగ్రవాదానికి పాకిస్థాన్ నిలయంగా మారిందని, ఈ సవాల్ పట్ల నిర్లక్ష్యం వహించడం మానవత్వానికి ద్రోహం చేయడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న పాకిస్తాన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే ఏ దేశమైనా జవాబుదారీగా ఉండి, మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండొద్దని స్పష్టం చేశారు. మానవత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక చర్య తీసుకోకపోతే, చరిత్ర మనల్ని ఎప్పటికీ క్షమించబోదని తేల్చి చెప్పారు. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం, మన ఆలోచన విధానం స్పష్టంగా ఉండాలన్నారు. భారత్ ఎల్లప్పుడూ మానవాళి ప్రయోజనాల కోసం పనిచేస్తుందని, ఉన్నతంగా వ్యవహరిస్తుందని నొక్కిచెప్పారు.
ఏఐ సహా ఆరు అంశాలపై జీ7 ఏకాభిప్రాయం
వలసదారుల అక్రమ రవాణా, ఏఐ వంటి అంశాలపై G7 దేశాల నాయకులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఖనిజాలు, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, వైల్డ్ ఫైర్, క్వాంటం కంప్యూటింగ్, వలసదారుల అక్రమ రవాణా వంటి అంశాలపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఈ మేరకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
భారత్-కెనడా సంబంధాల పునరుద్దరణ
జీ7 సదస్సులో భాగంగా ప్రధాని మోడీ దక్షిణ కొరియా, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, కెనడా దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల హైకమిషనర్లను నియమించేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారు. దీంతో రెండు దేశాల మధ్య మరోసారి ద్వైపాక్షిక సంబంధాలు నెలకొనే అవకాశం కనిపిస్తోంది.
క్రొయేషియా ప్రధానితో భేటీ
జీ7 సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని మోడీ అక్కడి నుంచి క్రొయేషియా వెళ్లారు. రాజధాని జాగ్రెబ్‌లో మోడీకి భారతీయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఆ దేశ ప్రధాని ఆండ్రేజ్ ప్లెన్కోవిక్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్‌లో జరిగిన ఉగ్రదాడి గురించి ఆండ్రేజ్‌కు వివరించారు. అనంతరం ఇండియాలో జరిగిన ఉగ్రదాడిపై ఆండ్రేజ్ విచారం వ్యక్తం చేశారు. కాగా, భారత ప్రధాని క్రొయేషియాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.






