జీ7 సమ్మిట్‌కు ప్రధాని మోడీ.. కాల్ చేసి ఆహ్వానించిన కెనడా కొత్త ప్రధాని!

by Phanindra |

జీ7 సమ్మిట్‌కు ప్రధాని మోడీ వెళ్తున్నారు. కెనడా కొత్త ప్రధాని కాల్ చేసి ఆహ్వానించారని వెల్లడించారు.

జీ7 సమ్మిట్‌కు ప్రధాని మోడీ.. కాల్ చేసి ఆహ్వానించిన కెనడా కొత్త ప్రధాని!
X

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలో కెనడాలోని కనానాస్కిస్‌లో జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశంలో తను పాల్గొంటున్న విషయాన్ని ప్రధాని మోడీ ధ్రువీకరించారు. ‘కెనడా ప్రధాని మార్క్ జే కార్నీ నుంచి కాల్ అందుకున్నందుకు చాలా సంతోషిస్తున్నా. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపాను. అలాగే ఈ నెలలో జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేశాను. ఇరుదేశాలు ప్రజల మధ్య లోతైన అనుబంధాలున్నాయి. ఇవే రెండు దేశాలను కలుపుతున్నాయి. పరస్పర గౌరవం, ఇరుదేశాలకు ఉపయోగపడే అంశాలను దృష్టిలో పెట్టుకొని భారత్, కెనడా రెట్టించిన ఉత్సాంతో కలిసి పనిచేస్తాయి. అందుకే జీ7 సమ్మిట్‌లో మీతో సమావేశం కోసం ఎదురు చూస్తున్నా’ అంటూ మోడీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.


కెనడా ప్రధానిగా ఎన్నికైన కార్నీతో ప్రధాని మోడీ తొలి అధికారిక సమావేశం జీ7 సమావేశంలోనే జరగనుంది. కెనడా-భారత్ మధ్య సంబంధాలు కొంత సమస్యాత్మకంగా ఉన్న నేపథ్యంలో జీ7 సమావేశానికి ప్రధాని మోడీ హాజరవ్వరంటూ ఊహాగానాలు వెల్లువెత్తాయి. భారత విదేశాంగ శాఖ కూడా ప్రధాని కెనడా పర్యటనకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదని మే నెలలో రెండుసార్లు స్పష్టంచేసింది. ఈ క్రమంలోనే జీ7 సమావేశంలో తను కూడా పాల్గొంటున్నట్లు ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించారు.

Next Story