Pm modi: వికసిత్ భారత్ ప్రతి భారతీయుడి లక్ష్యం.. ప్రధాని మోడీ

by B.Srinivas |

వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమ్ ఇండియాలా కలిసి పనిచేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

Pm modi: వికసిత్ భారత్ ప్రతి భారతీయుడి లక్ష్యం.. ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమ్ ఇండియాలా కలిసి పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) పిలుపునిచ్చారు. రెండు ప్రభుత్వాలు ఉమ్మడిగా కలిసి పని చేస్తే ఏ లక్ష్యం అసాధ్యం కాదని నొక్కి చెప్పారు. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడే భారత్ పురోగతి సాధిస్తుందని తెలిపారు. ఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ పదో పాలక మండలి సమావేశంలో మోడీ ప్రసంగించారు. వికసిత్ భారత్ ప్రతి భారతీయుడి లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో కనీసం ఒక పర్యాటక కేంద్రాన్ని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఇది పొరుగు నగరాలను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంపై ప్రతి ఒక్కరూ దృష్టిపెట్టాలని, అభివృద్ధిలో వేగం పెంచాలని సూచించారు.

భారతదేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని కాబట్టి ఫ్యూచర్ సిటీల కోసం రాష్ట్రాలు కృషి చేయాలని తెలిపారు. వృద్ధి, ఆవిష్కరణ, స్థిరత్వం మన నగరాల అభివృద్ధికి చోదకాలుగా ఉండాలన్నారు. ప్రతి రాష్ట్రం దాని వనరులు, సంస్కృతి, అవసరాలకు అనుగుణంగా ఒక బ్లూప్రింట్‌ను సిద్ధం చేసుకోవాలన్నారు. శ్రామిక శక్తిలో మహిళలను చేర్చుకునే దిశగా కృషి చేయాలని, వారిని గౌరవ ప్రదంగా శ్రామిక శక్తిలో చేర్చడానికి అనుమతించే చట్టాలు, విధానాలను రూపొందించాలని తెలిపారు. ఈ పాలసీల వల్ల సామాన్య పౌరుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేలా ఉండాలన్నారు.

140 కోట్ల మంది ఆకాంక్షలను నెరవేర్చాలి

140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఒక బృందంగా మనకు గొప్ప అవకాశం ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టాలి - 2047 నాటికి లేదా అంతకు ముందు భారతదేశాన్ని అభివృద్ధి చేయడమే అందరి ఏకైక కర్తవ్యంగా ఉండాలన్నారు. ప్రతి రాష్ట్రం, ప్రతి నగరం, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నారు. సరైన చొరవతో పనిచేస్తే, అభివృద్ధి చెందిన భారతదేశంగా మారడానికి 2047 వరకు వేచి ఉండాల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేశారు. కాగా, వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ @2047 థీమ్ తో ఈ కార్యక్రమం నిర్వహించారు.

రికార్డు స్థాయి భాగస్వామ్యం

నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు గాను 31 రాష్ట్రాలు భాగస్వామ్యమైనట్టు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని సమావేశాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలు హాజరు కాలేదు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయడానికి భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్‌కు సమావేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారని సుబ్రహ్మణ్యం తెలిపారు. కాగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత రాష్ట్రాల సీఎంలతో మోడీ నిర్వహించిన మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం.

Next Story