కోడిగుడ్లలో ప్లాస్టిక్ కలకలం.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో.. స్పందించిన సంస్థ

by Ramesh Naini |

ప్రముఖ ఆన్‌లైన్ డెలివరీ యాప్ ద్వారా ఆర్డర్ చేసిన 'ఎగ్గోజ్' బ్రాండ్ కోడిగుడ్లలో ప్లాస్టిక్ లాంటి పదార్థం కనిపించిందని ఓ మహిళ చేసిన ఆరోపణలు వైరల్‌గా మారాయి.

కోడిగుడ్లలో ప్లాస్టిక్ కలకలం.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో.. స్పందించిన సంస్థ
X

దిశ, డైనమిక్ బ్యూరో: నేటి కాలంలో మనం తినే ఆహారం ఎంతవరకు సురక్షితం? అనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆన్‌లైన్ డెలివరీ యాప్ 'జెప్టో' (Zepto) ద్వారా ఆర్డర్ చేసిన 'ఎగ్గోజ్' (Eggoz) బ్రాండ్ కోడిగుడ్లలో ప్లాస్టిక్ లాంటి పదార్థం కనిపించిందని ఓ మహిళ చేసిన ఆరోపణలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. షాలిని శర్మ అనే మహిళ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జెప్టో ద్వారా తాను 'ఎగ్గోజ్ ఎవ్రీడే' బ్రాండ్ గుడ్లను కొనుగోలు చేశానని, వాటిని ఉడకబెట్టినప్పుడు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయని ఆమె పేర్కొన్నారు. గుడ్లను ఉడకబెట్టగానే లోపల పచ్చసొనకు బదులుగా ప్లాస్టిక్ పోగులు (Plastic strands) బయటకు వచ్చాయని ఆమె వీడియోలో చూపించారు.

నూడుల్స్ లాంటి పదార్థం!

వైరల్ వీడియో ప్రకారం.. ‘ఇప్పటివరకు మార్కెట్లో నకిలీ గుడ్లు లేదా ప్లాస్టిక్ గుడ్లు అమ్ముతున్నారని విన్నాను, కానీ ఈరోజు నా కళ్ళతో నేరుగా చూశాను. ఉడకబెట్టిన గుడ్ల నుంచి నూడుల్స్ లాంటి ప్లాస్టిక్ పదార్థం బయటకు వస్తోంది. ప్రతి గుడ్డుపై ఎగ్గోజ్ స్టాంప్ కూడా ఉంది. ఇంత పెద్ద బ్రాండ్లు కూడా ఇలాంటి నాణ్యత లేని వస్తువులను సరఫరా చేస్తే, సామాన్యులు ఏం తినాలి?’ అని షాలిని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో సదరు కంపెనీ వెంటనే రంగంలోకి దిగింది. వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో స్పందిస్తూ.. ‘మీకు కలిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాము. మీ ఆందోళనను మేము అర్థం చేసుకోగలం. తక్షణమే మీ వివరాలను మాకు పంపండి, మా కస్టమర్ సపోర్ట్ టీమ్ మిమ్మల్ని సంప్రదించి ఈ సమస్యను పరిష్కరిస్తుంది’ అని పేర్కొంది.

FSSAI జోక్యానికి నెటిజన్‌ల డిమాండ్

కంపెనీ క్షమాపణలు చెప్పినప్పటికీ, నెటిజన్లు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రాణాంతకమైన ఇలాంటి పదార్థాలను విక్రయించడంపై ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI) కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆహార నాణ్యత పాటించని సంస్థల లైసెన్సులను రద్దు చేయాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్‌లు కోరుతున్నారు.

Next Story