పది రోజుల క్రితమే నిశ్చితార్థం.. ఇంతలోనే..

by Ajay Maddhiboyina |

ప్రమాదంలో చనిపోయిన సిద్ధార్థ్ యాదవ్‌కు పది రోజుల క్రితమే నిశ్చితార్థం అయ్యింది. అతని కుటుంబానికి సుదీర్గ కాలంగా సైనిక సేవ చేసిన చరిత్ర ఉంది.

పది రోజుల క్రితమే నిశ్చితార్థం.. ఇంతలోనే..
X

- జామ్‌నగర్‌లో కూలిన ఐఏఎఫ్ జాగ్వర్ జెట్

- పైలెట్ సిద్ధార్థ్ యాదవ్ మృతి

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లోని జామ్‌నగర్ సమీపంలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌)కు చెందిన యుద్ద విమానం బుధవారం రాత్రి కూలిపోయింది. సాధారణ శిక్షణలో భాగంగా విమానం గాల్లో చక్కర్లు కొడుతున్న సమయంలో కూలిపోవడంతో పైలెట్ ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ (28) ప్రాణాలు కోల్పోయాడు. అతని కో పైలెట్ సురక్షితంగా బయటపడ్డాడు. జామ్‌నగర్‌కు దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో సువర్దా గ్రామంలో రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. జనసాంద్రత ఉన్న ప్రాంతంలో విమానం కూలిపోకుండా దూరంగా తీసుకొని వెళ్లడానికి ప్రయత్నించిన క్రమంలో.. వెంటనే అందులో నుంచి పైలెట్ సిద్ధార్థ్ యాదవ్ బయటపడలేక పోయాడు. విమానం నేలకు తాకగానే మంటలు చెలరేగాయి. అది పడిన పొలం అంతటా శిథిలాలు చెల్లాచెదురుగా పడినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. వెంటనే వాయి సేన అధికారులకు సమాచారం అందించారు.

ప్రమాదంలో చనిపోయిన సిద్ధార్థ్ యాదవ్‌కు పది రోజుల క్రితమే నిశ్చితార్థం అయ్యింది. అతని కుటుంబానికి సుదీర్గ కాలంగా సైనిక సేవ చేసిన చరిత్ర ఉంది. సిద్ధార్థ్ ముత్తాత బ్రిటిష్ పాలనా కాలంలో బెంగాల్ ఇంజనీర్స్2లో పని చేశారు. సిద్ధార్థ్ తాత పారా మిలటరీ దళంలో పని చేశారు. అతని తండ్రి ఎల్ఐసీలో చేరడానికి ముందు భారత వైమానిక దళంలో కూడా పని చేవారు. అతని కుటుంబంలో దేశానికి సేవ చేసిన నాల్గవ తరంగా సిద్ధార్థ్ ఉన్నాడు. 2016లో ఎన్డీయే పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత పైలెట్ కావడానికి మూడేళ్ల పాటు కఠిన శిక్షణ పొందాడు. రెండేళ్ల సర్వీస్ తర్వాత ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా పదోన్నతి లభించింది. ప్రమాదానికి 10 రోజు ముందు, మార్చి 23న సిద్ధార్థ్ నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 2న అతనికి పెండ్లి కావల్సి ఉంది. రేవారీలోని తన కుటుంబంతో గడిపిన తర్వాత మార్చి 31నే అతను తిరిగి విధుల్లో చేరాడు.

Next Story