- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగలతో పోరాడి.. ‘హీరో’లా కన్నుమూసిన పెట్ డాగ్!
విశ్వాసానికి మారుపేరైన ఓ పెంపుడు కుక్క.. తన యజమానుల ఇంటిని కాపాడే క్రమంలో దొంగలతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలింది.

దిశ, డైనమిక్ బ్యూరో: విశ్వాసానికి మారుపేరైన ఓ పెంపుడు కుక్క.. తన యజమానుల ఇంటిని కాపాడే క్రమంలో దొంగలతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సత్నా జిల్లాలోని ప్రేమ్ విహార్ కాలనీలో నితిన్ యాదవ్ తన కుటుంబంతో నివాసముంటున్నాడు. వీరు ‘స్వీటు’ అనే పమేరియన్ జాతి కుక్కను పెంచుకుంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉండగా.. ఓ దొంగల ముఠా ప్రహరీ గోడ దూకి ఇంట్లోకి చొరబడింది. వారిని పసిగట్టిన స్వీటు, దొంగలను అడ్డుకుంటూ గట్టిగా మొరగడం ప్రారంభించింది. కుక్క అరుపులకు నిద్రలేచిన కుటుంబ సభ్యులు వెంటనే లైట్లు వేశారు. లైట్లు వెలగడంతో భయపడిన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. అంతా సద్దుమణిగిందని భావించిన కుటుంబ సభ్యులు మళ్లీ నిద్రలోకి జారుకున్నారు.
ఉదయానికి విగతజీవిగా..
శనివారం ఉదయం నిద్ర లేచి చూసేసరికి ఇంటి ఆవరణలో స్వీటు విగతజీవిగా పడి ఉంది. దాని చుట్టుపక్కల పూల కుండీలు పగిలిపోయి ఉన్నాయి. ఇంట్లో చోరీకి అడ్డుగా నిలిచిందన్న కోపంతో.. దొంగలు కుక్కపై దాడి చేసి, గొంతు నులిమి చంపి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు. తమ ఇంటిని కాపాడి ‘హీరో’లా ప్రాణాలొదిలిన స్వీటు మృతితో నితిన్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న సిటీ కొత్వాలి పోలీసులు.. కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.






