ఆకలి కేకలతో వీధుల్లోనే కుప్పకూలుతున్న జనాలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-24 03:36:32  IST  )

ఇజ్రాయెల్‌-హమాస్‌ (Israel-Hamas) యుద్ధంతో గాజాలో (Gaza) సంక్షోభం తారాస్థాయికి చేరింది.

ఆకలి కేకలతో వీధుల్లోనే కుప్పకూలుతున్న జనాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్‌-హమాస్‌ (Israel-Hamas) యుద్ధంతో గాజాలో (Gaza) సంక్షోభం తారాస్థాయికి చేరింది. పోషకాహారం లేక చిన్నారులు, వృద్ధులు బలహీనమవుతున్నారు. గాజా ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 111 మంది ఆకలి చావుకు గురయ్యారు. దురదృష్టకరంగా వీరిలో 80 మంది చిన్నారులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే 20 మంది ఆకలితో మరణించడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా మానవతా సేవల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వాలు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించాయి.

గాజాలో ఆహారం తక్కువవడం వల్ల పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వృద్ధులు, పిల్లలు నీరసంతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. తల్లులకు పాలు రాకపోవడం వల్ల శిశువులు ఆకలితో తల్లడిల్లుతున్నారు. గాజాలో పరిస్థితులు పూర్తిగా చేజారిపోతున్నాయని ‘సేవ్ ది చైల్డ్’, ‘ఆక్స్‌ఫామ్’, ‘ఎంఎస్‌ఎఫ్’ వంటి 115 స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్‌ విధించిన దిగ్బంధనంతో గాజాలో మానవతాసాయం అందటం సవాలుగా మారింది. గాజా జనాభా 20 లక్షలు కాగా, రోజుకు కేవలం 28 ట్రక్కుల ఆహార మాత్రమే సరఫరా జరుగుతుంది. మార్కెట్లు ఖాళీగా మారిపోయాయి. వ్యర్థాలు పేరుకుపోయాయి. ఆకలి, డీహైడ్రేషన్‌తో రోడ్లపై కుప్పకూలిపోతున్నారు.

ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటివరకు 59 వేల మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. మే 27 తర్వాత జరిగిన దాడుల్లో మాత్రమే వెయ్యిమందికి పైగా మరణించారు. వీరిలో చాలామంది మానవతా సహాయ కేంద్రాల వద్ద భద్రత కోసం వేచి చూస్తున్నవారే కావడం బాధాకరం. గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోని ఆహార పంపిణీ కేంద్రాల వద్ద 700 మంది చనిపోగా, ఐక్యరాజ్యసమితి పంపిణీ కేంద్రాల వద్ద మరో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలపై యూఎన్ఓ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, కాల్పుల విరమణ చేపట్టి, సరిహద్దులు తక్షణమే తెరిచి మానవతా సహాయాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా అందించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.

Next Story