Patna Businessman: పాట్నా వ్యాపారవేత్త హత్యతో సంబంధం ఉన్న ప్రధాన నిందితుడు ఎన్‌కౌంటర్‌

by S Gopi |

రాజాను పట్టుకోవడానికి ఒక బృందం ఆ ప్రాంతానికి చేరుకున్నప్పుడు అతడు కాల్పులు జరిపాడని పోలీసులు వెల్లడించారు.

Patna Businessman: పాట్నా వ్యాపారవేత్త హత్యతో సంబంధం ఉన్న ప్రధాన నిందితుడు ఎన్‌కౌంటర్‌
X

దిశ, నేషనల్ బ్యూరో: బీహార్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్‌ ఖేమ్కా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. తాజాగా ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న కీలక నిందితుడు రాజా మంగళవారం ఉదయం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించినట్టు అధికారులు మీడియాకు తెలిపారు. పాట్నా నగరంలోని మాల్ సలామి ప్రాంతంలో పోలీసు బృందాలు నిందితుడిని అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఖేమ్కాను చంపడానికి ఉపయోగించిన ఆయుధాన్ని రాజాయే సరఫరా చేశాడని, ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన షూటర్ ఉమేష్‌తో అతనికి సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. రాజాను పట్టుకోవడానికి ఒక బృందం ఆ ప్రాంతానికి చేరుకున్నప్పుడు అతడు కాల్పులు జరిపాడని, దీంతో ఎదురు కాల్పుల్లో అతను మరణించాడని పోలీసులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి పోలీసులు ఒక పిస్టల్, లైవ్ కార్ట్రిడ్జ్‌లు, షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఖేమ్కా హత్యకు సంబంధించి డజనుకు పైగా అనుమానితులను పాట్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక రోజు తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ముఖ్యంగా, జూలై 6న ఖేమ్కా అంత్యక్రియలకు హాజరైన పాట్నాలోని పన్‌పన్‌కు చెందిన రోషన్ కుమార్ అనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూలై 4 రాత్రి గోపాల్‌ ఖేమ్కా కదలికలను ట్రాక్ చేసిన స్పాటర్లు చాలా మంది కుట్రదారుల సహాయంతో హత్యను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి అమలు చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. గోపాల్‌ ఖేమ్కా బీహార్‌లో బాగా పేరున్న పారిశ్రామికవేత్త. ఆరోజు రాత్రి 11:40 గంటల ప్రాంతంలో గాంధీ మైదాన్ ప్రాంతంలోని తన నివాసం వెలుపల కారు దిగిన క్షణాల వ్యవధిలోనే హంతకులు ఆయనను కాల్చి చంపారు.

Next Story