పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు తేదీలు ఖరారు..!

by Hajipasha |   (  Updated:2023-01-02 17:14:12  IST  )

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు తేదీలు ఖరారు..!
X

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెడతారని తెలిపాయి. ఈ బడ్జెట్ సమావేశాలు మధ్యలో విరామం తీసుకుని, ఏప్రిల్ 6 వరకు కొనసాగనున్నాయని పేర్కొన్నాయి. ముందుగా సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం కేంద్రం చేపట్టిన ఆర్థిక సర్వేనూ అదే రోజు ఇరు సభల్లోనూ ప్రవేశపెట్టనున్నారు. తర్వాతి రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని, సెషన్ మొదటి భాగం ఫిబ్రవరి 10 వరకు కొనసాగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

వివిధ మంత్రిత్వ శాఖల మంజూరు డిమాండ్లను స్టాండింగ్ కమిటీలు పరిశీలించిన విరామం తర్వాత, రెండవ భాగం సెషన్ మార్చి 6న మొదలై.. ఏప్రిల్ 6న ముగిసే అవకాశం ఉందని వారు తెలిపారు. బడ్జెట్ సమావేశాల మొదటి భాగంలో, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభలు సవివరమైన చర్చను, ఆ తర్వాత కేంద్ర బడ్జెట్‌పై చర్చను నిర్వహిస్తాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని మోడీ సమాధానం ఇవ్వనుండగా కేంద్ర బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తారు. కాగా, ఈసారి బడ్జెట్ సమావేశాలు నూతన పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టాలోనే జరగనున్నాయని భావించగా, చివరి దశలో ఉన్న నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో తొలి భాగం సమావేశాలను ప్రస్తుత పార్లమెంటులోనే నిర్వహించి, రెండో భాగం సమావేశాలను నూతన భవనంలో నిర్వహించాలని భావిస్తున్నట్టు సదరు వర్గాలు వెల్లడించాయి.

Next Story